Inspiring Story: పట్టుదలకు నిదర్శనం.. 8వ ప్రయత్నంలో సివిల్స్ సాధించిన హెడ్ కానిస్టేబుల్
25 May 2023, 7:04 IST
- Inspiring Story: ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ రామ్ భజన్ కుమార్ ఎనిమిదో ప్రయత్నంలో యూపీఎస్‍సీ పరీక్షలో విజయం సాధించారు. పట్టుదలతో కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరారు.
రామ్ భజన్ కుమార్ (Photo: Twitter)
సాధించాలన్న పట్టుదల, కృషి, అలుపెరుగని సన్నద్ధత ఉంటే అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటికైనా చేరవచ్చు. వైఫల్యాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటి నుంచి కూడా నేర్చుకుంటూ కష్టపడితే అనుకున్నది సాధించవచ్చు. ఈ మాటలను ఢిల్లీకి చెందిన హెడ్‍కానిస్టేబుల్ రామ్ భజన్ కుమార్ నిజం చేశారు. 8వ ప్రయత్నంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించారు. ఏడుసార్లు వైఫల్యాలు ఎదురైనా పట్టువిడవకుండా ప్రయత్నించి ఎట్టకేలకు ఎనిమిదోసారి యూపీఎస్‍సీ పరీక్ష క్లియర్ చేశారు. సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ పరీక్ష ఫలితాలను యూపీఎస్‍సీ ఇటీవల ప్రకటించింది. ఇందులో రామ్‍భజన్ కుమార్ 667 ర్యాంకు సాధించారు. ఆయన స్ఫూర్తిదాయక స్టోరీ ఇదే.
కల నిజమైంది
సివిల్స్ సాధించాలన్న తన కల ఇప్పటికి నిజమైందని, అయితే ర్యాంకును మెరుగుపరుచుకునేందుకు ఇంకోసారి ప్రయత్నిస్తానని రామ్ భజన్ కుమార్ తెలిపారు. “నేను కన్న కలలు నిజమయ్యాయి. ఇది నా ఎనిమిదో ప్రయత్నం. నేను ఓబీసీ కేటగిరీకి చెందినందున నాకు తొమ్మిదిసార్లు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది నా రెండో లాస్ట్ ఛాన్స్. ఒకవేళ ఈసారి కూడా యూపీఎస్‍సీ పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించకపోయి ఉంటే.. మళ్లీ ప్రయత్నించే వాడిని. నా ర్యాంక్‍ను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో మే 28న జరిగే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరువుతున్నా” అని న్యూస్ ఏజెన్సీ పీటీఐతో 34 ఏళ్ల రామ్ భజన్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‍లో హెడ్ కానిస్టేబుల్‍గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రతీరోజు ఆరు గంటలు.. ఇప్పుడు 16 గంటలు
రామ్ భజన్ కుమార్ ప్రతీ రోజు ఆరు గంటల పాటు చదివేవారు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ నుంచి యూపీఎస్‍సీ మెటీరియల్ తెచ్చుకునేవారు. పరీక్షల తేదీలు దగ్గర పడే సమయంలో నెల రోజులు సెలవు తీసుకొని ప్రతీ రోజు 16 గంటల వరకు చదివేవారు.
ఆయనే స్ఫూర్తి
2019లో యూపీఎస్‍సీ పరీక్షలో విజయం సాధించి ఏసీపీ అయిన కానిస్టేబుల్ ఫిరోజ్ ఆలమ్ తనకు స్ఫూర్తి అని రామ్ భజన్ కుమార్ చెప్పారు. “ఆలమ్ సర్ ర్యాంక్ సాధించాక.. మరింత కష్టపడేందుకు నాకు స్ఫూర్తి వచ్చింది. యూపీఎస్‍సీ కోసం ప్రిపేర్ అవుతున్న నా లాంటి చాలా మంది కోసం ఆయన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ప్రోత్సహిస్తున్నారు” అని రామ్ భజన్ చెప్పారు. 2009 నుంచి పోలీసు శాఖలో రామ్ భజన్ పని చేస్తున్నారు.
కుటుంబం కష్టాలను చూశా..
తాను విఫలమవుతున్నా.. రెండేళ్లుగా తన భార్య ప్రోత్సహించిందని, సపోర్టుగా నిలిచిందని రామ్ భజన్ కుమార్ చెప్పారు. “నేను రాజస్థాన్‍లోని ఓ గ్రామం నుంచి వచ్చా. మా తండ్రి కూలీగా పని చేస్తున్నారు. మమ్మల్ని చదివించేందుకు, పోషించేందుకు మా కుటుంబం ఎంత కష్టపడిందో నేను చూశా. మేం ఎప్పుడు ఆశను కోల్పోలేదు. నాకు అవకాశం దక్కినప్పుడు, నేను కష్టపడాలని నిర్ణయించుకున్నా. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నా” అని రామ్ భజన్ కుమార్ చెప్పారు.
టాపిక్