Sangareddy Crime : ఒక చోరీ కోసం మరో మూడు చోరీలు-చివరికి తల్లికొడుకుల ప్రాణం తీసింది
27 November 2024, 21:40 IST
Sangareddy Crime : మద్యానికి బానిసైన ఓ యువకుడు ఒక దొంగతనం చేయగా...అది మరో మూడు చోరీలకు దారితీసింది. చివరికి చోరీల విషయం ఊరిలో తెలిసి పంచాయితీకి పిలవగా.. భయంతో మంజీరాలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు దూకడం చూసి తల్లి సైతం నదిలో ఆత్మహత్యకు పాల్పడింది.
ఒక చోరీ కోసం మరో మూడు చోరీలు-చివరికి తల్లికొడుకుల ప్రాణం తీసింది
ఓ యువకుడు మద్యం మత్తులో ఒక దొంగతనం చేసి ఆపై వెనువెంటనే మూడు దొంగతనాలకు కారణమయ్యాడు. దీంతో గ్రామస్థులు పంచాయతీకి రమ్మన్నందుకు భయంతో తల్లి కొడుకు మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అందోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వడ్ల యాదయ్య, బాలమణి (50) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు శ్యామ్ (20) మద్యానికి బానిసయ్యాడు.
శుభకార్యానికి వచ్చిన ఓ వ్యక్తి వాహనాన్ని
సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి టాటాఎస్ వాహనంలో ఆదివారం రాత్రి చింతకుంట గ్రామానికి శుభకార్యానికి వచ్చాడు. అనంతరం సోమవారం ఉదయం తిరిగి వెళ్లిపోదామనికొని నిశ్చయించుకొని ఆ టాటాఎస్ వాహనాన్ని గ్రామంలోని ఖాళీ స్థలంలో రాత్రి పార్కింగ్ చేశాడు. కాగా మద్యానికి బానిసైన శ్యామ్ మద్యం మత్తులో అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో టాటాఎస్ వాహనాన్ని అపహరించి కౌడిపల్లి మండలం బుజరంపేట మీదుగా వెళ్తుండగా గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న కాలువలో ఇరుక్కుపోయింది.
గ్రామస్థులు అరవడంతో
ఆ వాహనాన్ని కాలువలో నుంచి బయటకు తీయడానికి అక్కడ దగ్గర్లో ఉన్న ఒక ట్రాక్టర్ ని ఎత్తుకొచ్చాడు. ఆ ట్రాక్టర్ సహాయంతో కాలువలో ఉన్న వాహనాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా ట్రాక్టర్ కూడా కాలువలో ఇరుక్కుపోయింది. దీంతో వీటిని బయటకు తీయడానికి గ్రామంలో మరో ట్రాక్టర్ ని తీసుకొస్తుండగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు లేచి దొంగ దొంగా అని వెంబడించారు. దీంతో అక్కడే సమీపంలో ఉన్న బైక్ పై అక్కడి నుంచి పారిపోయాడు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా
సోమవారం ఉదయం బుజారంపేట గ్రామస్థులు దుంపలకుంట గ్రామా చౌరస్తాలో ఒక కిరాణా దుకాణం వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించి బైక్ పై యువకుడు వెళ్లినట్లుగా గుర్తించారు. ఆ పారిపోయిన యువకుడు అందోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన శ్యామ్ గా గుర్తించారు. దీంతో ఆ గ్రామస్థులు చింతకుంట గ్రామానికి వెళ్లి అక్కడ పెద్ద మనుషులతో మాట్లాడి శ్యామ్ ను తమకు అప్పగించాలని, లేకపోతే టాటాఏస్ వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు.
తల్లికొడుకు కాలువలో దూకి
అనంతరం గ్రామ పెద్దలు శ్యామ్ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో శ్యామ్, అతని తల్లిదండ్రులు, చిన్నమ్మ బుజారంపేట గ్రామానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం తండ్రి, చిన్నమ్మ బస్సులో బయల్దేరగా, శ్యామ్ అతని తల్లి బాలమణితో కలిసి బైక్ పై బయల్దేరాడు. అక్కడికి వెళ్తే వారు ఏం చేస్తారో ఏమోనని భయాందోళనకు గురైన శ్యామ్ చింతకుంట శివారులోని మంజీరా వంతెన పైకి వెళ్ళగానే బైక్ ని అక్కడ ఆపి అతడు నీటిలోకి దూకాడు. వెంటనే తల్లి కూడా నదిలో దూకింది.
ఈ ఘటనను చెరువులో చేపలు పడుతున్న జాలరులు గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం సాయంత్రం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుడు శ్యామ్ తండ్రి యాదయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.