Sangareddy Lorry Accident : సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి- అతివేగం, నిద్రమత్తే కారణం
Sangareddy Lorry Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజాంపూర్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ముంబయి జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ నిజాంపూర్ సమీపంలో ఆగి ఉన్న మరో లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివపేట జాతీయ రహదారిపై నిజాంపూర్ సమీపంలో ఘట్కేసర్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో లారీని రోడ్డుపక్కన నిలిపి క్లీనర్లు పంక్చర్ చేస్తున్నారు. అదే సమయంలో వెనక నుంచి అతివేగంగా వచ్చిన మరో లారీ... ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లినర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి.
అతివేగం, నిద్రమత్తే కారణం
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. మృతులు ఘట్కేసర్ లోని అన్నాజీగూడకు చెందిన దీపక్ పరమేశ్వర్ లుగా గుర్తించారు. గాయపడిన వారిలో యోగేష్, శేఖర్, దేవి సింగ్ ఉత్తర్ ప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అతివేగం, నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదం
సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద ఆదివారం తుఫాన్ వాహనం బోల్తా పడడంతో 18 మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్ర దెగ్లూర్ నుంచి ఆదివారం హైదరాబాద్ కు 20 మంది ప్రయాణికులతో తుఫాన్ వాహనం బయలుదేరింది. అతివేగంగా వస్తున్న తుఫాన్ వాహనం నాందేడ్- అకోలా జాతీయ రహదారిపై బాచేపల్లి శివారులోకి రాగానే బైక్ ని ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సు లో నారాయణఖేడ్ ఆసుపతికి తరలించారు. పరిస్థితి విషమంగా దీపాలి, విలాస్, లక్ష్మీబాయి అనే ముగ్గురిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద విషయాన్నీ తెలుసుకున్న కల్హేర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
సిద్దిపేటలో మరో ఘటన
వ్యవసాయ పనులకు కూలీలతో వెళ్లే ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఐదుగురికి గాయాలయిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణికి చెందిన 9 మంది కలిసి ఆటోలో కొమురవెల్లి మండలంలోని లెనిన్ నగర్ కు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి అందరూ ఆటోలో కూర్చున్నారు. కానీ డ్రైవర్ ఆటో గేర్ లో ఉన్న విషయాన్నీ గమనించకుండా వెనక తాడు లాగి స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆటో ముందుకు దూసుకవెళ్లి బోల్తాపడింది. అప్రమత్తమైన పలువురు ఆటోలో నుండి దుకాగా ... ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంబంధిత కథనం