Sandhya Theatre Stampede Video : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది- సంచలన వీడియో
22 December 2024, 22:22 IST
Sandhya Theatre Stampede Video : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన వీడియ విడుదల చేశారు. ఈ వీడియోలో తొక్కిసలాటకు ముందు, అల్లు అర్జున్ వచ్చిన సమయాల్లో జనం, వాస్తవ పరిస్థితులు పూర్తిగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది- సంచలన వీడియో
Sandhya Theatre Stampede Video : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన వీడియో విడుదల చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన వీడియో ప్రజెంటేషన్ ప్రదర్శించారు. ఈ మేరకు పూర్తి వీడియోను విడుదల చేశారు.
డిసెంబర్ 4వ తేదీ రాత్రి అసలు ఏం జరిగింది?
-వైట్ ఫార్ట్యూనర్ కారులో అల్లు అర్జున్ మామ, కూతురు వచ్చారు.
-బ్లాక్ స్కార్పియోలో అల్లు అర్జున్ కుమారుడు వచ్చారు.
-9.25 PM - రేవతి, తన కుమారుడు శ్రీతేజ్ తో థియేటర్ గేటు లోపలికి వచ్చారు.
-అల్లు అర్జున్ రాక ముందు థియేటర్ వద్ద జనం అదుపులోనే ఉన్నారు.
-9.28 PM to 9.34 PM మధ్యలో ముషీరాబాద్ మెట్రో స్టేషన్, ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ వరకు కారు రూఫ్ నుంచి నిలబడి అల్లు అర్జున్ వచ్చారు. స్టీల్ బ్రిడ్జి, మెట్రో స్టేషన్, పక్కనున్న థియేటర్ నుంచి జనం ఒక్కసారిగా అల్లు అర్జున్ ను చూసేందుకు సంధ్య థియేటర్ వైపు వచ్చారు.
-9.35 PM -దాదాపు 40-50 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో థియేటర్ మెయిన్ గేట్ లోకి అల్లు అర్జున్ కారు ప్రవేశించింది. థియేటర్ వద్దకు రాగానే అల్లు అర్జున్ రూఫ్ టాప్ పైకి వచ్చి అభిమానులకు వేవ్ చేసుకుంటూ వచ్చారు.
-9.35 నుంచి 9.40 PM మధ్య లోయర్ బాల్కనీకి వెళ్లే దారిలో గ్రిల్ గేటు వద్ద జనం పెరిగిపోయారు. దీంతో గ్రిల్ గేట్ విరిగి తొక్కిసలాటకు దారి తీసింది.
-సుమారు 9.40 PM కి అల్లు అర్జున్ కారులోంచి బయటకు వచ్చారు. ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్లే మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అల్లు అర్జున్ ను థియేటర్ లోకి తీసుకువెళ్లారు. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరుకున్నారు.
-లోయర్ బాల్కనీలో రేవతి, అతని కుమారుడు ఉన్నారు. అల్లు అర్జున్ రావడంతో లోయర్ బాల్కనీలోకి జనం వచ్చేశారు. ఇక్కడే రేవతి, బాలుడు స్పృహ కోల్పోయారు.
-అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతడ్ని చూసేందుకు కొంత మంది అప్పర్ బాల్కనీ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు.
-9.45 -9.50 మధ్య లోయర్ బాల్కనీలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి, శ్రీతేజ్ లను గుర్తించిన పోలీసులు, జనం... థియేటర్ బయటకు తీసుకువచ్చారు.
-రేవతి, శ్రీతేజ్ ను థియేటర్ బయటకు తీసుకొచ్చి సీపీఆర్ చేశారు.
-అనంతరం రేవతి, శ్రీతేజ్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
-సుమారు 10.45 PM కి ఏసీపీ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక థియేటర్ వద్ద పరిస్థితి, రేవతి చనిపోయిన విషయం, బాలుడి పరిస్థితిని అల్లు అర్జున్ కు తెలియజేసేందుకు అనేక సార్లు పోలీసులు ప్రయత్నించగా, అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ అడ్డుపడ్డాడు. పోలీసులు అల్లు అర్జున్ ను థియేటర్ నుంచి తీసుకుని వెళ్లాలని మేనేజర్ కు చెప్పారు.
-11.45 PM వరకు మేనేజర్ అల్లు అర్జున్ ను బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి రేవతి, శ్రీతేజ్ ల పరిస్థితి, బయట క్రౌడ్ గురించి చెప్పి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. కానీ అల్లు అర్జున్ సినిమా పూర్తైన తర్వాతే వెళ్తానని చెప్పారు.
-సుమారు 11.40 PM కు సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ ను తీసుకు వెళ్లాలని చెప్పారు. మేనేజర్ పది నిమిషాలు సమయం అడగ్గా, పోలీసులు థియేటర్ బయట రూట్ క్లియర్ చేశారు.
-అర్ధరాత్రి 12.05 AM(5వ తేదీ) అల్లు అర్జున్ ను డీసీపీ బయటకు తీసుకొచ్చారు.
-థియేటర్ బయటకు వచ్చిన అల్లు అర్జున్ కారులో ఎక్కి గేటు బయటకు వచ్చారు. కారు రూఫ్ టాప్ పై నిలబడి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.
"తొక్కిసలాట ఘటన గురించి అల్లు అర్జున్ కు తెలియ చేద్దాం అంటే అతని మేనేజర్ అడ్డుకున్నారు. బయట ఒక లేడీ చనిపోయింది, ఇంకో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పినా సినిమా చూశాకే థియేటర్ బయటకు వస్తా అన్నారు. అప్పుడు మేము, మా డీసీపీ, సిబ్బందితో కలిసి లోపలికి వెళ్లి అల్లు అర్జున్ ను బయటకి తీసుకొచ్చాం"- చిక్కడపల్లి ఏసీపీ రమేష్