తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu Updates : 'ఇంకా అక్కడి వరకే'...! 'రైతుబంధు' నిధుల జమ తాజా అప్డేట్ ఇదే

Rythu Bandhu Updates : 'ఇంకా అక్కడి వరకే'...! 'రైతుబంధు' నిధుల జమ తాజా అప్డేట్ ఇదే

03 January 2024, 15:22 IST

google News
    • Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు కింద ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ… డబ్బుల జమ ప్రక్రియ నత్తనకడన సాగుతోంది. అయితే ప్రస్తుతం డబ్బుల జమకు సంబంధించి తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
రైతుబంధు నిధులు
రైతుబంధు నిధులు

రైతుబంధు నిధులు

Rythu Bandhu Scheme Updates : రైతుబంధు డబ్బుల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. మూడు వారాల కిందటే డబ్బుల జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. అయితే నిధుల జమ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతూ వస్తోంది. మరోవైపు నిధులు ఎప్పుడొస్తాయా అంటూ రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ కు సంబంధించి గతంలో ఉన్న స్కీమ్(రైతుబంధు) కు అనుగుణంగానే నిధులను జమ చేయాలని సూచించారు.. త్వరలోనే రైతుభరోసాగా మార్చి… జమ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తాజా పరిస్థితి ఇదే….

రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు డబ్బులు జమ అయ్యాయా లేదా అని తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు అన్నదాతలు. కేవలం గుంటలలోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా… ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రం డబ్బులు జమ కానట్టు తెలిసింది. ఇక తాజా పరిస్థితిపై రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలానికి చెందిన వ్యవసాయ సంబంధిత అధికారులను సంప్రదించింది హిందుస్తాన్ టైమ్స్ తెలుగు. ప్రస్తుతం ఎకరంలోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయని వారు తెలిపారు. ఇందులో కూడా మరో 20 శాతం మందికి డబ్బులు జమ కావాల్సి ఉందని… ఇప్పటి వరకు 80 శాతానికి పైగా పూర్తి అయ్యిందని వెల్లడించారు. ఈ సీజన్ ముగిసే లోపు నాటికి ప్రతి రైతు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. ఎకరంలోపు రైతులు పూర్తి అయిన తర్వాత….మిగతా వారికి నిధులు జమ అవుతాయని వివరించారు.

అప్లికేషన్స్ కు నో ఛాన్స్…

కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా… రెండు రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… రైతుభరోసాకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తోంది సర్కార్. ఇప్పటికే రైతుబంధు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని… కొత్త రైతులు మాత్రమే చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో… తగిన చర్యలు తీసుకునే పనిలో వ్యవసాయశాఖ ఉందని తెలుస్తోంది.

ఇకపై రైతుభరోసాగా…

గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం