Rangareddy Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, కూరగాయలమ్మే వారిపైకి దూసుకెళ్లిన లారీ- నలుగురు దుర్మరణం
02 December 2024, 18:33 IST
Rangareddy Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన కూరగాయలు అమ్మేవారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఆలూరు రైల్వే గేటు వద్ద జరిగింది.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, కూరగాయలమ్మే వారిపైకి దూసుకెళ్లిన లారీ- నలుగురు దుర్మరణం
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఆలూరు రైల్వే గేటు వద్ద కూరగాయలు అమ్మే వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురి దుర్మరణం చెందినట్లు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ -బీజాపుర్ రహదారి వద్ద దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుంటారు. కూరగాయలమ్మే వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీని చూసి కొందరు వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొని ఆగింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.
హైదరాబాద్- బీజాపుర్ రహదారిపై ఆలూరు స్టేజీ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు విక్రయించే వారిపైకి లారీ దూసుకెళ్లడంతో బీతావాహ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్) మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దైవ దర్శనానికి వెళ్తుండగా దూసుకొచ్చిన మృత్యువు
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం జగన్నాథపురానికి చెందిన ఊకే రాజు... ఏపీలోని నర్సీపట్నానికి చెందిన గుడివాడ ప్రసాద్‌లు సింగరేణి ఓసీ ఓబీ క్యాంపులో మిషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. ప్రసాద్ నర్సీపట్నంలోని తన భార్య రాజ్యలక్ష్మి, కుమార్తెలను తీసుకుని రెండు రోజుల క్రితం సత్తుపల్లికి వచ్చారు. తన స్నేహితుడు రాజు కుటుంబంతో కలిసి ప్రసాద్ ఆదివారం తిరుమలకు బయల్దేరారు. వీరు ముందు విజయవాడకు, అక్కడి నుంచి తిరుపతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో రాజు, తన భార్య స్వరూపారాణి, కుమారులు యశ్వంత్, దీక్షిత్‌తో కలిసి బైక్ పై జగన్నాథపురం నుంచి కిష్టారంలోని ఓబీ క్యాంపు వద్దకు వచ్చారు. అప్పటికే ప్రసాద్ కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నారు. బస్టాండుకు వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన నిలుచుని ఉన్న వారిపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రాజు కుమారుడు యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ నాలుగేళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడింది. గాయపడిన వారిని సత్తుపల్లి సీహెచ్‌సీకి తరలించారు. కుమారుడు యశ్వంత్ కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదించారు.