Ponnam Sathaiah Goud Award : చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యలకు పొన్నం సత్తయ్య గౌడ్ అవార్డు, ఈ నెల 13న ప్రదానం
09 September 2024, 22:28 IST
- Ponnam Sathaiah Goud Award : ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, బలగం ఫేం కొమురమ్మ, మొగిలయ్యలు పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 13న రవీంద్రభారతిలో వీరికి అవార్డులు అందించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ అవార్డులు అందిస్తున్నారు.
చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యలకు పొన్నం సత్తయ్య గౌడ్ అవార్డు, ఈ నెల 13న ప్రదానం
Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య గౌడ్ 3వ మెమోరియల్ అవార్డుకు ప్రముఖ సినీగేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, బలగం ఫేం కొమురయ్య, మొగిలయ్యలు ఎంపికయ్యారు. ఈనెల 13న రవీంద్ర భారతి వేదికగా అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి సోదరులు, కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం రచయితలకు , కళాకారులకు పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు అందిస్తున్నారు. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రముఖ రచయిత, కళాకారులను ఎంపిక చేయడానికి జ్యూరీ కమిటీ సమావేశం అయింది.
జ్యూరి కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు సీనియర్ పాత్రికేయులు, కేంద్ర మాజీ సమాచార శాఖ కమిషనర్ మాడ భూషి శ్రీధర్ , ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , రచయిత్రి ఐనంపూడి శ్రీ లక్ష్మీ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు ఇస్తున్న మాదిరి ఈసారి కూడా కమిటీ పలువురు రచయితలు, కళాకారుల పేర్లను పరిశీలించింది. ఫైనల్ గా రచయితల విభాగంలో ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారుల విభాగంలో బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్యలను అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పేర్లను కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేశారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి 51 వేల రూపాయల నగదు, మెమోంటోతో సత్కరిస్తామని కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర తెలిపారు.
అవార్డు గ్రహీతలకు ఈనెల 13న పొన్నం సత్తయ్య గౌడ్ 13వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటలకు అవార్డులను ప్రధానం చేయనున్నారు. అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విశిష్ట అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. గతంలో పొన్నం సత్తయ్య మెమోరియల్ అవార్డు ప్రథమ సంవత్సరంలో రచయిత విభాగంలో నాళేశ్వరం శంకర్ , కళాకారుల విభాగంలో ఒగ్గు కథ ధర్మయ్యలు, ద్వితీయ సంవత్సరం రచయిత విభాగంలో నెలిమాల భాస్కర్ ,కళాకారుల విభాగంలో ప్రముఖ గాయని విమలక్క ఈ అవార్డులను అందుకున్నారు. ఈసారి రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు జరిగే కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ పొన్నం రవిచంద్ర పేర్కొన్నారు.