HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sunkishala Accident: సుంకిశాల చుట్టూ... రాజకీయ వివాదం, పంప్‌హౌస్‌ మునగడానికి కారకులెవరని వాదనలు

Sunkishala Accident: సుంకిశాల చుట్టూ... రాజకీయ వివాదం, పంప్‌హౌస్‌ మునగడానికి కారకులెవరని వాదనలు

HT Telugu Desk HT Telugu

09 August 2024, 16:54 IST

    • Sunkishala Accident: హైదరాబాద్‌కు తాగునీటికి కోసం నిర్మిస్తున్న  సుంకిశాల పంప్ హౌజ్ నీట మునగడానికి కారణం ఎవరన్నదానిపై వాదనలు జరుగుతున్నాయి. పనులు నాసిరకంగా జరిగాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో రూ.20కోట్ల నష్టం వాటిల్లింది. 
సుంకిశాల సర్జ్‌పూల్‌లో కూలిపోతున్న రిటైనింగ్ వాల్...

సుంకిశాల సర్జ్‌పూల్‌లో కూలిపోతున్న రిటైనింగ్ వాల్...

Sunkishala Accident:

  • ‘‘సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణమే అవసరం లేదు. దానికోసం ఖర్చు పెట్టే రూ.2వేల కోట్ల పైచిలుకు నిధులు ఎస్.ఎల్.బి.సి. టన్నెల్ కు పెట్టి ఉంటే ప్రయోజనకరంగా ఉండి ఉండేది…’’ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్
  • ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో మేడిగడ్డ, సుందిళ్ల మాత్రమే నాసిరకం అనుకున్నాం. క్రిష్ణా పథకాలూ అంతేనని సుంకేశుల పంప్ హౌజ్సం ఘటన నిరూపించింది. వారి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి చేసిన నాసిరకం పనులను మా ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నారు...’’ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
  • ‘‘సుంకేశాల పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్‌దేనని, తప్పును కాంగ్రెస్ పైకి నెట్టాలని చూస్తున్నారని ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని బాధ్యులపై చర్యలు తప్పవని, హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రిగా రాజధాని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం..’’ పొన్నం ప్రభాకర్

...

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం దాహార్తీ తీర్చే సుంకిశాల తాగునీటి పథకం చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుకున్న తీరును పైన పేర్కొన్న ప్రకటనలు రుజువు చేస్తున్నాయి. మరో యాభై ఏళ్ల అవసరాలను అంచనా వేసి కనీసం 71 టీఎంసీల నీటి అవసరాన్ని గుర్తించి రాజధాని తాగునీటి అవసరాల కోసం క్రిష్ణా జలాలను తరలించే ఈ పథకానికి రూపకల్పన చేశారు. వాస్తవానికి నాలుగు దశాబ్ధాల కిందటిది ఈ పథకం. కానీ, రెండేళ్ల కిందటే పట్టాలెక్కింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 మే 14వ తేదీన అప్పటి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్ రెడ్డి తదిరులు పనులకు శ్రీకారం చుట్టారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. వాస్తవానికి పుట్టంగండి (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) నుంచి ప్రస్తుతం హైదరాబాద్ కు తాగునీరు అందిస్తున్నారు. ఎ.ఎం.ఆర్.పిలో కీలకమైన అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు సాగర్ వెనుక జలాల నుంచి పుట్టంగడి వద్ద నీటిని ఎత్తిపోసి తీసుకుంటారు.

అక్కంపల్లి రిజర్వాయరు నుంచి కోదండాపూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు నీటిని చేర్చి, అక్కడ శుద్ది చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఎ.ఎం.ఆర్.పి శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ (ఎస్.ఎల్.బి.సి) ప్రాజెక్టులో భాగం. శ్రీశైలం టన్నెల్ ప్రాజెక్టు పూర్తయితే, క్రిష్ణా జలాలను టన్నెల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయరుకు నీరు చేరుతుంది. అపుడు పుట్టంగండి వద్ద అతి దిగువ నుంచి అతి ఎగువకు నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం కూడా ఉండదు ఎస్.ఎల్.బి.సికి సరిపడా నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తే.. రూ.2,215 కోట్ల అంచనా వ్యయంతో సుంకేశుల ప్రాజెక్టును మొదలు పెట్టాల్సిన అవసరమే ఉండదని ఓ రిటైర్డ్ ఇంజనీరు ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’తో అభిప్రాయపడ్డారు. కానీ, గత బీఆర్ఎస్

ప్రభుత్వం ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రాజెక్టును పక్కన పడేసి, కొత్త ప్రాజెక్టును తీసుకోవడంలోనే మతలబు దాగి ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, సాగర్ లో నీటి మట్టం 510 అడుగుల కిందికి పోతే పుట్టంగండి నుంచి నీటిని తీసుకోలేమని, వేసవిలో తాగునీటి సమస్యలు వస్తున్నాయని, అందుకే సాగర్ లో నీటి మట్టం 462 అడుగుల ఉన్నా (డెడ్ స్టోరేజీ) ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటిని తీసుకోవచ్చని చెబుతున్న బీఆర్ఎస్ వర్గాలు, ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ద్వారా అక్కంపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు నీటిని చేర్చి తాగునీటికి వాడుకోవచ్చనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించి మాట్లాడడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

‘సుంకిశాల ’ తాగునీటి పథకం అంచనా వ్యయం రూ.1450 కోట్లతో మొదలు పెట్టి, రూ.2,215 కోట్లకు చేర్చారు. పర్సెంటేజీల కోసం తమకు అనుకూలమైన సంస్థకు పనులు అప్పజెప్పారు. అసలు అవసరం లేని ప్రాజెక్టులను చేపట్టడంలోనే అసలు మతలబంతా దాగి ఉంది..’ అని జిల్లా కాంగ్రెస్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఈ పనులకు టెండర్ పిలిచింది, మేఘ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది నాటి కేసీఆర్ నేత్రుత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.

ఈ ప్రాజెక్టులో ఇన్ టేక్ వెల్, వాటర్ సంప్, పంప్ హౌజ్, 3 సొరంగాలు, పంప్ హౌజ్ కు ఓ స్ట్రక్చర్, కోదండాపూర్ ప్లాంట్ వరకు మూడు వరసల పైప్ లైన్లు, మోటార్ల కొనుగోలు, తదితర పనులు కలిసి ఉన్నాయి. ఇందులో ఇన్ టేక్ వెల్ పనులు 60శాతం, పంపింగ్ మెయిన్ పనులు 70శాతం, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40శాతం వరకు పూర్తయ్యాయి.

‘ఈ పనుల రూపంలో పర్సెంటేజీలు చేతులు మారాయన్నదే మా ఆరోపణ. శ్రీశైలం టన్నెల్ నుంచి నీటిని తీసుకోవాలంటే, ఆ పనులు చేస్తే సరిపోయేది, అప్పటి దాకా పుట్టం గండి నుంచి తీసుకునే వీలుంది. అయినా, కొత్త ప్రాజెక్టు తీసుకోవడంలో ఉన్న మతలబు ఏమిటి ’..? అని ఆ నాయకుడు ప్రశ్నించారు. కాగా, సుంకిశాలలో జరిగిన సంఘటన వల్ల రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని హైదరాబాద్ జల మండలి ప్రకటించగా, ఆ నష్టం అంతా ఇంజనీరంగ్ సంస్థ భరిస్తుందని కూడా ప్రకటించింది.

1980 నుంచీ .. ఇదే తంతు

గత ఏడాది వేసవి నాటికే పనులు పూర్తై అందుబాటులోకి రావాల్సిన ఈ పథకానికి ఆదినుంచీ అన్నీ రాజకీయ అడ్డంకులే. సుంకిశాల పంప్ హౌజ్ లో నిర్మించిన రక్షణ గోడ ఈ నెల 1వ తేదీన కూలిపోవడంతో 590 అడుగుల లోతున్న పంప్ హౌజ్ పూర్తిగా సాగర్ జలాలతో నిండిపోయింది. ప్రాజెక్ట్ లో నీటిమట్టం కనీసానికి పడిపోతే కానీ, ఈ పనులు తిరిగి మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే ఉద్దేశంతో 1980లోనే సుంకిశాల ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు.

ఉమ్మడి ఏపీ సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయంలో పనులు మొదలు పెట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. జిల్లాకు చెందిన సీపీఎం, టీడీపీ వర్గాలు అడ్డుపడ్డాయి. ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు జరిగి, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎ.ఎం.ఆర్.పిని పూర్తి చేసి హైదరాబాద్ కు తాగునీరు తరలిస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమయంలోనే ఇక్కడి నుంచి జిల్లా రైతాంగానికి సాగునీరు, ప్రజానీకానికి తాగునీరు ఇవ్వకుండా నీటిని లా తీసుకుపోతారని పెద్ద ఆందోళన జరిగింది.

ఆ సమయంలో ఏర్పాటు చేసిన కోట్ల కార్యక్రమం సందర్భంగా పోలీస్ ఫైరింగ్ కూడా జరిగింది. దీంతో సుంకేశుల అటకెక్కింది. చంద్రబాబు నాయుడు నిర్ణయంతో ఎ.ఎం.ఆర్.పి రూపుదిద్దుకుంది. ఇపుడు బీఆర్ఎస్ నేతలు చెబుతున్న ప్రకారం ఎ.ఎం.ఆర్.పి నుంచి హైదరాబాద్ కు పూర్తిగా తాగునీటిని తీసుకోవడం ఆపేసి కేవలం సుంకేశుల నుంచి మాత్రమే తీసుకునేందుకే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారు. కానీ, ఈ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చును శ్రీశైలం టన్నెల్ కు కేటాయించి ఉంటే, క్రిష్ణా జలాలే అక్కంపెల్లికి చేరేవని, అటు సాగు, తాగునీటి అవసరాలు తీరేవి కదా అన్న బలమైన వాదన ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దలు పేర్కొంటున్నారు.

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనినే సూచిస్తున్నాయి. పనులు నాసిరకంగా జరగడం వెనుక పెద్ద మొత్తంలో పర్సెంటేజీలు చేతులు మారడమే కారణమన్న అభిప్రాయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటల వల్ల తేటతెల్లం అవుతోంది. అసలు ప్రాజెక్టును మొదలు పెట్టడంలో జరిగిన మతలబులు అన్నీ బయటకు తేవాల్సిందే అన్న అభిప్రాయం హైదరాబాద్ ఇన్ చార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన న్యాయ విచారణ జరిపిస్తామన్న ప్రకటన ద్వారా తెలిసి పోతుంది.

సుంకిశాల తప్పిదాన్ని కాంగ్రెస్ పైకి నెట్టేసే ప్రయత్నం బీఆర్ఎస్ అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రయత్నించారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండప్రతినిధి )

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్