Sunkishala Accident: సుంకిశాలలో భారీ ప్రమాదం, సర్జ్‌పూల్‌లో కూలిన రిటైనింగ్ వాల్,హైదరాబాద్ కృష్ణా నీటి తరలింపులో జాప్యం
08 August 2024, 13:05 IST
- Sunkishala Accident: హైదరాబాద్ మహానగరానికి కృష్ణాజలాలాను తరలించే సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ప్రమాదం జరిగింది. సాగర్‌లో గరిష్ట నీటి మట్టం చేరడంతో సుంకిశాల టన్నెల్స్‌లోకి చేరిన నీరు రిటైనింగ్ వాల్స్ కూల్చేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగనుంది.
సుంకిశాల సర్జ్‌పూల్‌లో కూలిపోతున్న రిటైనింగ్ వాల్...
Sunkishala Accident: హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తోన్న ‘ సుంకిశాల ప్రాజెక్టుపై పిడుగు పడింది. 462 అడుగుల నీటి మట్టం నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించేలా నిర్మిస్తోన్న సుంకిశాల ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరిగింది. కృష్ణానది నుంచి సొరంగాల ద్వారా నీటిని తరలించేందుకు చేపట్టిన నిర్మాణాలు సాగర్‌లో గరిష్ట నీటి మట్టం చేరడంతో కుప్పకూలాయి. గత వారమే ఈ ప్రమాదం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.
హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన సుంకిశాల ప్రాజెక్ట్ మరింతగా ఆలస్యం కానుంది. నిజాం కాలంనాటి గండిపేట అవసరాలు తీర్చలేక పోతోందని, కొన్నాళ్లు మంజీర నుంచి తాగునీటిని తీసుకున్నా అవీ సరిపోలేదు.
దీంతో 1980లోనే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునేలా సుంకిశాల ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ, అక్కడి రైతాంగం నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ప్రభుత్వం వెనకడుగు వేసింది.
ఎలిమనేటి మాధవరెడ్డి ప్రాజెక్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి సీఎం చంద్రబాబు నాయడు 2001 లో ఈ పథకాన్ని పక్కన పెట్టి పుట్టంగండి (ఏఎంఆర్ ప్రాజెక్టు- ఎలిమనేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) నుంచి నీరు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ఎలిమనేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) నల్గొండ జిల్లా రైతులకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టు. కానీ, ఇదే కాల్వల నుంచి హైదరాబాద్ అవసారల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం కోదండాపూర్ వద్ద నీటిశుద్ది ప్లాంట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని తరలిస్తున్నారు.
అయితే, పుట్టంగడి నుంచి తాగునీటిని తీసుకోవాలంటే నాగార్జు సాగర్ లో కనీసం 510 అడుగుల నీటిమట్టం ఉండాలి. ఇంత కంటే నీటిమట్టం తగ్గితే అత్యవసర మోటార్లు ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసుకుని తీసుకోవాల్సి వస్తుంది. దీనికోసం హైదరాబాద్ జల మండలికి ప్రతీ ఏటా రూ.6 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ సమస్యలన్నింటినికీ చరమగీతం పాడి హైదరాబాద్ మహానగర తాగునీటి అవసారలకోసమే ప్రత్యేకంగా సుంకిశాల ప్రాజెక్టును మొదలు పెట్టారు.
సుంకిశాలకు ... అన్నీ అడ్డంకులే..
సుంకిశాల ప్రాజెక్టుకు 1980లోనే అంకురార్పణ జరిగినా.. అది ముందకు పడలేదు. రెండేళ్ల కిందట ఎట్టకేలకు నీటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టినా.. ఇపుడా అంచనా వ్యయం రూ.2,215 కోట్లకు పెరిగింది. నాగార్జుజన సాగర్ జలాశయంలో నీరు 462 అడుగుల కనీస నీటిమట్టానికి చేరుకున్నా సుంకిశాల నుంచి ఎలాంటి సమస్య లేకుండా తాగునీటిని తీసుకోవచ్చు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులు గత 2023 వేసవి కాలం నాటికే పూర్తై హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించాలి. ఏఎంఆర్పీ నుంచి తాగునీటిని తీసుకోవడం మానేసి, కోదండాపూర్ నీటి శుద్ది కేంద్రానికి సుంకిశాల నుంచి నీటిని తీసుకుని, ప్రస్తుతం ఉన్న పైప్ లైన్ల ద్వారానే నీటిని అందివ్వాల్సి ఉంది. సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు సుమారు పది కిలోమీటర్లకు పైగా నిడివిలో మూడు వరసల పైప్ లైన్ అంటే 35 కిలోమీటర్ల నిడివిలో నిర్మాణం పూర్తి కావొచ్చాయి.
కూలిపోయిన రిటైనింగ్ వాల్..
కానీ, సాగర్ జలాశయం నుంచి తీసుకునే నీటి కోసం మూడు సొరంగాల నిర్మాణం, సొరంగాల ద్వారా వచ్చే నీటిని తోడిపోయడానికి ఇన్ టైక్ వెల్ నిర్మించి అక్కడి నుంచి ఎత్తిపోయాల్సి ఉంది. కానీ, తాజాగా జరిగిన సంఘటనలో సుంకిశాల ఇన్ టేక్ వెల్ని ర్మాణంలో రక్షణ గోడ (రిటెయినింగ్ వాల్ ) కూలిపోయింది. దీంతో సర్జ్ పూల్పూర్తిగా క్రిష్ణా నీటితో నిండిపోయింది. ఈ పనులు తిరిగి మొదలు కావాలంటే నాగార్జున సాగర్ లో తిరిగి నీటిమట్టం కనీస స్థాయికి పడిపోవాలి.
ప్రస్తుతం నాగార్జున సాగర్ నిండు కుండలా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టంతో జలకళను సంతరించుకుంది. కనీసం రెండు వ్యవసాయ సీజన్లకు సరిపడా నీరున్నట్టే. దీంతో సుంకిశాల పనులు పూర్తి కావాలంటే మరో మూడేళ్ళ సమయమైనా పడుతుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ కు పుట్టంగడే దిక్కు
హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం నీరందిస్తున్న పుట్టంగడి నుంచే మళ్లీ నీరు తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అందించేందుకు క్రిష్ణా తో పాటు గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం నుంచి కూడా నీరు తరలించాలని నిర్ణయించారు. నగర అవసరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నందు భవిష్యత్ అవసరాలను కూడా గమనంలోకి తీసుకుని నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం నగరానికి ప్రతీ రోజు 270 మిలియన్ గ్యాలెన్ల నీరు అవసరం పడుతోంది.
వాస్తవానికి మరో యాభై ఏళ్ల భవిష్యత్ ను కూడా ద్రుష్టిలో పెట్టుకుని 72 టీఎంసీల నీటిని తీసుకునేలా జలమండలి ప్లాన్ చేసింది. ఇపుడు సుంకిశాల ప్రమాదం వల్ల ఈ పనులు ఇప్పట్లోగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తిరిగి పుట్టంగండిపై ఆధారపడాల్సి ఉంటుంది.
సుంకిశాలలో ఏం జరిగింది..?
సుంకిశాలలో సర్జ్ పూల్ నిర్మాణం జరుతోంది. మూడు సొరంగాల నుంచి వచ్చే సాగర్ జలాలను దీనిద్వారా ఎత్తి పోసి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండాపూర్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలించాలి. సాగర్ జలాశయం 462 అడుగుల నీటి మట్టం నుంచి నీరు తీసుకోవాలి కాబట్టి, అంతే కింది నుంచి మూడు సొరంగాలు తవ్వారు. అవి సాగర్ జలాశయం వైపు ఇంకా పూర్తి కాలేదు.
ఈ సొరంగాల నుంచి నీరు వచ్చి పనులకు అంతరాయం కలగకుండా సొరంగమార్గానికి గేటు ఏర్పాటు చేయడంతో పాటు, రక్షణ గోడలు కడా నిర్మించారు. కానీ, సాగర్ జలాశయం ప్రస్తుతం పూర్తి స్థాయిలో 590 అడుగుల నీటిమట్టంలో ప్రస్తుతం 585 అడుగుల నీరుంది. దీంతో ఈ సొరంగాల్లోకి నీరుచేరి, గేట్లను బద్దలు కొట్టి, రిటెయినింగ్ వాల్ కూల్చేసి ఇన్ టేక్ వెల్‌లోకి నీరు వచ్చింది.
ఈ నీరంతా ప్రత్యేక మోటార్లతో తోడేసి పనులు చేద్దామన్నా, జలశాయం వైపు ముఖద్వారం ఉన్న టన్నెల్ పనులు చేపట్టే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు మరోమూడేళ్ల వరకైనా పూర్తయ్యే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, రిటెయినింగ్ వాల్ కూలిపోయిన విషయాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచడం గమనార్హం.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )
..
Photo writup : సుంకిశాలలో ప్రమాదం జరిగింది ఈ ఇన్ టెక్ వెల్ లోనే ( ఫైల్ )