BRS Balka Suman : సీఎం రేవంత్ పై కామెంట్స్ - బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు నోటీసులు
11 February 2024, 13:07 IST
- Police Notice To Balka Suman: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
బాల్క సుమన్ కు నోటీసులు
Police Notice To BRS Ex MLA Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా… ఇందులో భాగంగా ఆదివారం నోటీసులు అందజేశారు. నోటీసులను అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు.
పోలీసుల నోటీసులపై బాల్క సుమన్ స్పందిస్తూ…. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా తనపై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయిందని ఆరోపించారు. ఇందులో భాగంగా మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ తమదన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే….
బీఆర్‌ఎస్ పార్టీ మంచిర్యా జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సుమన్…. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఘాటుగా మాట్లాడారు. కేసీఆర్ విమర్శించిన రేవంత్ రెడ్డికి తన చెప్పును చూపిస్తూ... కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఇందులో భాగంగానే…. మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.
సుమన్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తూ వస్తున్నారు. తమ అధినేతను అసభ్య పదజాలంతో దూషించిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై ముందుగా కేసు నమోదు చేయాలని అంటున్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందంటూ కౌంటర్లు ఇస్తున్నారు.