CM Revanth Reddy : టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, పెండింగ్ బకాయిలు రూ.280 కోట్లు విడుదలకు హామీ
CM Revanth Reddy : మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ మరో 100 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
CM Revanth Reddy : మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి 1325 బస్సులను దశలవారీగా వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేసింది. అందులో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్ ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి/రాజధాని బస్సులున్నాయి. వాటిలో ఇప్పటికే కొన్ని బస్సులను వాడకంలోకి తెచ్చిన సంస్థ తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించింది. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాం వద్ద శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లతో కలిసి 100 కొత్త బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిది
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన 60 రోజుల వ్యవధిలోనే 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించగా.....అందుకు సంబంధించిన రూ.535 కోట్ల చెక్ ను మహిళలతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్యమంత్రి అందజేశారు. అంతకముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతోనే మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలి ప్రభుత్వ హామీని అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని అన్నారు. ప్రకటించిన 48 గంటల్లోనే పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల రోజుకు సగటున రూ.13 కోట్లు, ప్రతి నెల రూ.300 నుంచి 400 కోట్లు భారం పడుతున్నా... వెనకడుగు వేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. త్వరలో జరగబోయే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
పెండింగ్ బకాయిలు రూ.280 కోట్లు విడుదల
కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ 100 బస్సుల్లో.....90 ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయని, ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఉపయోగపడతాయన్నారు. అలాగే శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్ బకాయిలు రూ.280 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా 2200 కొత్త బస్సులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రిని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ప్రతి ఆర్టీసీ బస్సు నిండుగా తిరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహాలక్ష్మి అమలుకయ్యే నిధులను ఎప్పటికప్పడు టీఎస్‌ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ సిబ్బంది అద్భుతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం