Mahalakshmi scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం-hyderabad news in telugu cm revanth reddy started mahalakshmi scheme free journey to women in rtc buses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahalakshmi Scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

Mahalakshmi scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

Bandaru Satyaprasad HT Telugu
Dec 09, 2023 03:31 PM IST

Mahalakshmi scheme : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తారు.

మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Mahalakshmi scheme : తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా శనివారం అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఇకపై ఉచితంగా ప్రయాణం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ జారీ చేయనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను రానున్న 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే చేయూత పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. ముందుగా ఆరోగ్యశ్రీ లోగో, నూతన పోస్టర్‌లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును సీఎం అందజేశారు.

రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు

అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజలకు ఇవాళ పండగ రోజు అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి అనగానే సోనియా గాంధీ రూపం కనిపిస్తుందన్నారు. మనది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే అవకాశం సోనియమ్మ ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియ గాంధీ ఆరు గ్యారంటీలను ఇచ్చారని, వీటిల్లో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తీసుకుందన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు

కాంగ్రెస్ ప్రకటించిన ఆరోగ్యశ్రీ బీమా క్రింద వైద్యానికి రూ.10 లక్షల సాయం అందిస్తుంది. గతంలో ఇది ఐదు లక్షల వరకే పరిమితి ఉండగా… ప్రస్తుతం ఇది 10 లక్షల వరకు పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఇది అమలవుతుంది. ఈ పథకం కింద ఉన్న వారు… పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. 1,310 ఆసుపత్రిల్లో ఈ సేవలు సేవలు అందుతున్నాయి. వీటిల్లో 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీల ఉన్నాయి. ఇందులో దాదాపు అన్ని రోగాలకు సేవలు అందుతున్నాయి.

Whats_app_banner