ACB Arrests Tahsildar : ఇసుక ట్రాక్టర్ కు రూ.లక్ష లంచం, ఏసీబీకి చిక్కిన అంతర్గాం తహసీల్దార్, ఆర్ఐ
19 November 2024, 20:42 IST
ACB Arrests Tahsildar : పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. రూ.12 వేలు లంచం తీసుకుంటూతహసీల్దార్ ఉయ్యాల రమేష్, ఆర్ఐ శ్రీధర్ ఏసీబీకి చిక్కారు. ఇద్దరిని అరెస్టు చేసి రూ.12 వేలు సీజ్ చేశారు.
ఇసుక ట్రాక్టర్ కు రూ.లక్ష లంచం, ఏసీబీకి చిక్కిన అంతర్గాం తహసీల్దార్, ఆర్ఐ
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం తహసీల్దార్ ఉయ్యాల రమేష్, ఆర్ఐ శ్రీధర్ లను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.తహసీల్దార్ నేరుగా లంచం డబ్బులు తీసుకోకుండా ఆర్ఐ శ్రీధర్ ద్వారా తీసుకోగా..అతడిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.తహసీల్దార్ తీసుకొమంటేనే డబ్బులు తీసుకున్నానని ఆర్ఐ చెప్పడంతో ఆర్ఐ తోపాటు తహసీల్దార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు.
ఇసుక ట్రాక్టర్ కు లక్షా డిమాండ్
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను గత నెల 27న పోలీసులు పట్టుకున్నారు. రెవెన్యూ అధికారులకు అప్పగించగా 25 వేల రూపాయల జరిమానా విధించారు. ఈనెల 14న ట్రాక్టర్ ఓనర్ ఆలంకుట మహేష్ రూ. 25 వేలు జరిమానా చెల్లించాడు. కానీ రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ రిలీజ్ చేయకుండా అదనంగా లక్ష రూపాయలు ఇస్తేనే ట్రాక్టర్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అంత ఇచ్చుకోలేనని మహేష్ ప్రాధేయపడగ చివరకు రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో మహేష్ నుంచి ఆర్ఐ శ్రీధర్ స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరో ఆర్ఐ శ్రీమాన్ పారిపోగా పట్టుబడ్డ ఆర్ఐని విచారించడంతో తహసీల్దార్ చెప్పడంతోనే డబ్బులు తీసుకున్నానని శ్రీధర్ చెప్పడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బుధవారం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
తహసీల్దార్ పై అవినీతి ఆరోపణలు
ప్రస్తుతం ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ రమేష్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఏ పని చేయడని స్థానికులు తెలిపారు. ఉద్యోగులు ఎవ్వరు డబ్బులు డిమాండ్ చేసిన ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
మూడేళ్ల క్రితం చిక్కిన తహసీల్దార్ ఆర్ఐ
అంతర్గం తహసీల్దార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. మూడేళ్ల క్రితం ఇలానే లంచం తీసుకుంటూ అప్పటి తహసీల్దార్ ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. మూడేళ్ల క్రితం అంతర్గాంలో భూమి రిజిస్ట్రేషన్ విషయంలో పెద్దంపేట శంకర్ నుంచి అప్పటి తహసీల్దార్ సంపత్, ఆర్ఐ హాజీమ్ లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా ట్రాక్టర్ ఓనర్ నుంచి రూ.12 వేలు తీసుకుంటూ తహసీల్దార్ ఆర్ఐ పట్టుబడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.