తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Acb Raids : నిర్మల్ జిల్లాలో తరుచూ ఏసీబీ దాడులు.. అయినా మారని అధికారుల తీరు

TG ACB Raids : నిర్మల్ జిల్లాలో తరుచూ ఏసీబీ దాడులు.. అయినా మారని అధికారుల తీరు

HT Telugu Desk HT Telugu

14 November 2024, 18:16 IST

google News
    • TG ACB Raids : ప్రభుత్వ ఉద్యోగులు కొందరు లంచాలకు తెగబడుతున్నారు. నెలనెల వేతనాలు వస్తున్నా.. పేదలను పట్టి పీడిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఏడాదిలో ముగ్గరు అధికారులు ఏసీబీకి చిక్కారు. ముఖ్యంగా మున్సిపల్, రెవెన్యూ శాఖ కార్యాలయాల్లో సంచాలు కామన్ అయిపోయాయి. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగి
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగి

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగి

నిర్మల్ మున్సిపాలిటీలో ఇంఛార్జ్ ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న షాకీర్ ఖాన్.. రూ.15 వేల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న చందుల భరత్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించి పట్టించాడు. భరత్ చెప్పిన వివరాలు ప్రకారం.. రెండు నెలలుగా తన ఉద్యోగం రెగ్యులర్ చేయడం కోసం డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడని ఆరోపించారు. మొదట రూ.20 వేలు డిమాండ్ చేయగా.. రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకరించామని చెప్పారు.

ఏడాదిలోపే రెండు సార్లు..

కొన్ని నెలల కిందట మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఏసీబీకి చిక్కాడు. మళ్లీ తాజాగా అదే శాఖలో షాకీర్ ఖాన్ రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇటీవల నిర్మల్ జిల్లాలోని పలు శాఖల్లో పనిచేసే అధికారులు లంచావతారం ఎత్తుతున్నారు. అయితే.. కొందరు చేసే అవినీతి కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తుందని.. తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ 3 శాఖల్లో..

నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో అవినీతి తిమింగలాలు ఎక్కువగా ఉన్నాయి. తోటి ఉద్యోగులను సైతం లంచం కోసం వేధించిన ఘటనలు ఉన్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల్లో లంచగొండి అధికారులకు కొదవే లేదు. ఈ మూడు శాఖల పేరు చెబితేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి వచ్చింది.

ఖానాపూర్ తహసీల్దార్..

ఖానాపూర్ తహసీల్దార్ నరేందర్‌పై అవినీతికి ఆరోపణలు వచ్చాయి. తన వారసత్వ భూమిని మార్చుకోవడానికి వస్తే.. ఎమ్మార్వో లంచం అడుగుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 30 జులై 2021లో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దారును పట్టుకున్నారు.

కడెం తహసీల్దార్ ఆఫీసులో..

కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన రైతు తన భూమిని పట్టా భూమిగా మార్చుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. అయితే.. అందుకు రూ.15 వేలు లంచం అడిగారు. డీటీ చిన్నయ్య ద్వారా తహసీల్దార్ రాజేశ్వరి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఎమ్మార్వో, డీటీ ఇద్దరు ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారం కడెం మండలంలో సంచలనంగా మారింది. తరచూ ఏసీబీకి చిక్కుతున్నా.. అధికారుల్లో మార్పు రావటం లేదు.

(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం