తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Politics | తెలంగాణ.. ఎన్నికలకు సిద్ధమవుతోందా? సూరీడిని మించిన రాజకీయ వేడి

Telangana Politics | తెలంగాణ.. ఎన్నికలకు సిద్ధమవుతోందా? సూరీడిని మించిన రాజకీయ వేడి

Anand Sai HT Telugu

01 May 2022, 22:05 IST

google News
    • కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చారు కేసీఆర్. అయితే టీఆర్‌ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల రాజకీయ యాత్రలు సాగుతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయా అనేంతలా.. పార్టీలు జోరు పెంచాయి.
తెలంగాణ రాజకీయాలు
తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే ఎక్కువ సమయం ఉంది. అయితే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ వరంగల్‌, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) నేత డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇప్పటికే యాత్రలో బిజీగా ఉన్నారు. ఎండాకాలం సూరీడి వేడి కంటే.. రాజకీయ వేడి ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్ష నేతలు అన్ని దారులను ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ నాయకుల ఉత్తేజ పరిచే.. ప్రసంగాలు, ర్యాలీలలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కొన్ని కొన్ని సభలకు భారీగా ప్రజలు హాజరు కావడం రాష్ట్రంలో రాజకీయ ఊపు మెుదలైనట్టుగా కనిపిస్తుంది.

ఇప్పటికే ‘మన ఊరు – మన పోరు’ పేరుతో జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్.. ఈసారి తమ అగ్రనేత.. రాహుల్ గాంధీని బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏయే అంశాలకు సంబంధించి హామీలు ఉంటాయో.. వరంగల్ సభలో తెలిపే ఛాన్స్ ఉంది. కౌలు రైతులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములు తీసుకున్న రైతులకు సంబంధించిన ఆందోళన, రైతు సంక్షేమం, పంట సేకరణ, కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ)కి సంబంధించిన అంశాలు ఉంటాయి.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులతో సమవేశం అవ్వాలని రాహుల్ అనుకున్నారు. కానీ సందిగ్ధత నెలకొంది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధికారులు అనుమతి నిరాకరించారు. క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నందున అనుమతి నిరాకరించినట్లు వైస్ ఛాన్సలర్ తెలిపారు.

రాహుల్ సభతో ఎన్నికలకు ముందుగానే రాష్ట్రంలో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు రైతులు, యువతను ఆకర్షించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2019లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు విధేయత చూపడంతో కాంగ్రెస్‌కు విశ్వాస పరీక్షలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

క‌రీంన‌గ‌ర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్.., గ‌ద్వాల్‌లో రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన, నిరుద్యోగం అంటూ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని మతపరమైన అంశాలపైనా.. బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్ జిల్లా నుంచి 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించిన బీఎస్పీ నేత, మాజీ పోలీసు అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల ప్రజలను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు, వ్యాపారాలు, విద్యాసంస్థల్లో బహుజనులకు ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ప్రవీణ్ కుమార్ ఎత్తిచూపుతున్నారు. అధికార, ఇతర ప్రతిపక్షాలకు పెద్ద దెబ్బగా భావించే ఆయన రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60 శాతం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇస్తామని ప్రకటించారు.

ఇప్పటికే 900 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లను తాకనుంది. తెలంగాణ రాష్ట్రంలో ‘రాజన్న రాజ్యం’ తీసుకురావాలని ఆమె చెబుతూ పర్యటన చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కుంటోందని ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేశారని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల కేవలం కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని, సామాన్య ప్రజలు కాదని అంటున్నారు.

పంజాబ్ రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని చూస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తెలంగాణపైనా గురిపెట్టింది. ఇప్పటికే.. తర్వాత ఏం చేయాలనే అంశంపై.. కసరత్తు చేస్తోంది. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిలో కలిసేందుకు కూడా సిద్ధంగా లేని.. ఆప్.. ఒంటరిగానే.. ముందుకెళ్తోంది.

మరోవైపు.. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలోనూ.. కేసీఆర్ స్పీచ్ చూస్తే.. ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్టుగానే అనిపిస్తుంది. కేంద్రంపై.. విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి.. వివరించారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. తెలంగాణలో.. మాత్రం.. ప్రస్తుతం రాజకీయ వేడి జోరుగా ఉంది.

తదుపరి వ్యాసం