తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dasara 2024 : దసరా ఇక్కడ ప్రత్యేకం.. జాతీయ జెండా ఆవిష్కరించడం ఆనవాయితీ!

Dasara 2024 : దసరా ఇక్కడ ప్రత్యేకం.. జాతీయ జెండా ఆవిష్కరించడం ఆనవాయితీ!

Published Oct 14, 2024 01:14 PM IST

google News
    • Dasara 2024 : తెలంగాణలో దసరా పెద్ద పండగ. విజయదశమి రోజున ఎక్కడైనా జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. కానీ.. మహబూబాబాద్ జిల్లా గార్లలో మాత్రం జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అందుకు ఓ బలమైన కారణం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏంటా కారణం.. ఓసారి చూద్దాం.
గార్లలో జాతీయ జెండా ఆవిష్కరణ

గార్లలో జాతీయ జెండా ఆవిష్కరణ

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మసీద్ సెంటర్‌లో.. దసరా పండగ రోజు శనివారం జాతీయ జెండాను ఎగరేశారు. గార్ల మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి మంగమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం పాలకుల కాలంలో దసరా రోజు.. నవాబు నీలిరంగులో నెలవంక ఉండే జెండా ఎగరవేసేవారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.


నిజాం పాలన అంతరించిన నాటి నుంచి.. ప్రతి ఏటా దసరా పండుగ రోజున గార్ల మసీద్ సెంటర్లో జాతీయ జెండా ఆవిష్కరించడం ఆనవాయితిగా వస్తుందని అంటున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా విజయదశమి రోజు.. జాతీయ జెండా ఆవిష్కరించడం ఒక్క గార్లలో కొన్నేళ్లుగా కొనసాగుతుందన్నారు. 1952లో గార్ల మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ తరఫున మాటేటి కిషన్ రావు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పుడు దసరా పండగ రోజున మసీద్ సెంటర్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరేశారు.

అప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుండగా.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్య వివాదం జరిగింది. ఈ విషయంపై హైకోర్టు వరకూ వెళ్లారు. దీంతో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దేశభక్తికి చిహ్నంగా.. మతసామరస్యానికి ప్రతీకగా జాతీయ జెండా ఎగరేయాలని సూచించింది. దీంతో గార్ల మున్సిపల్ ఛైర్మన్ మాటేటి కిషన్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారని గార్ల వాసులు చెబుతున్నారు.

అప్పటినుంచి ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. తాజాగా.. ప్రత్యేక అధికారి మంగమ్మ ఆధ్వర్యంలో మసీద్ సెంటర్ లోని గద్దెపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. దశాబ్దాలు ఈ ఆనవాయితీని కొనసాగించడం గర్వంగా ఉందని గార్ల వాసులు చెబుతున్నారు. కేవలం ఒక్క గార్లలోనే ఇది జరుగుతుందని.. దేశంలో ఇలాంటి కార్యక్రమం జరగదని అంటున్నారు.