Mla Sunitha Lakshma Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి- గూండా రాజ్యమని హరీష్ రావు విమర్శలు
23 September 2024, 17:57 IST
- Narsapur Mla Sunitha Lakshma Reddy : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి వద్ద ఆదివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద టపాసులు కాల్చారు.దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి- గూండా రాజ్యమని హరీష్ రావు విమర్శలు
Narsapur Mla Sunitha Lakshma Reddy : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జన వేడుకల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఇంటి ముందు టపాసులు పేల్చుతూ కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు టపాసులు పేలుస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగాయి. ఎమ్మెల్యే ఇంటి ముందు టపాసులు పేలుస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలు గేటు నుంచి లోపలికి వెళ్లి బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. ఘటన సమయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు ఇంట్లో లేరు. కానీ ఈ దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి.
రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుంది : హరీష్ రావు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో వారిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా గూండా రాజ్యం నడుస్తుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని ఆరోపించారు. మొన్న సిద్దిపేటలో తన కార్యాలయంపై, హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై, ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద జరిగిన దాడులే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ఉన్న మంచి పేరును మంటగలిపి బీహార్ లా రేవంత్ మారుస్తున్నాడని విమర్శించారు.
రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయన్నారు. 'ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడం, ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనది. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది' అని విమర్శించారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా? అని ప్రశ్నించారు. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కానీ కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరని విమర్శించారు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని దాడిని ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్లి దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. డీజీపీ వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ ఆఫీస్ ని ముట్టడిస్తామని తెలిపారు.