Election Code in Telangana : ఇవాళ్టి నుంచే అమల్లోకి ‘ఎన్నికల కోడ్ ’
09 October 2023, 13:42 IST
- Telangana Assembly Elections Schedule 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా… డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
Telangana Assembly Elections Schedule 2023: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ముఖ్య వివరాలను కూడా వెల్లడించింది. ఫలితంగా తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అయితే నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అమల్లోకి ఎన్నికల కోడ్…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని జిల్లాలో ఎన్నికల కోడ్, నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇకపై జిల్లా కలెక్టర్లతో పాటు నోడల్ అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు… పథకాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. గతంలో ప్రారంభించిన వాటి విషయంలో కూడా ఫిర్యాదులు అందితే… ఎన్నికల అధికారులు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలు ఎన్నికల కోడ్ కు లోబడి మాత్రమే ఉండాలి. ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికల కోడ్ కు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే…. చర్యలు తీసుకుంటుంది ఈసీ. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 3 వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల షెడ్యూల్ : 09 -10 -2023
నోటిఫికేషన్ : 03 - 11 - 2023
నవంబర్ 10 వరకు నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన
నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ
నవంబర్ 30న పోలింగ్
డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు
తెలంగాణలో ప్రతి 897 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుందని ఈసీ తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల కానుండగా… నామినేషన్లను నవంబర్ 11వ తేదీ వరకు స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా… 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. 27,798 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది ఎన్నికల సంఘం.