Telangana Elections Schedule 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ - నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు
09 October 2023, 13:13 IST
- Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ - 2023
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను పేర్కొంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు ఉండగా... తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించామని... పార్టీలు, ప్రభుత్వాధికారులతో చర్చలు నిర్వహించామని ఈసీ వివరించింది. మిజోరాం శాసనసభ పదవీకాలం డిసెంబర్ 17, ఛత్తీస్‌గఢ్ జనవరి 3, మధ్యప్రదేశ్ జనవరి 8, రాజస్థాన్ జనవరి 14, తెలంగాణ శాసనసభ పదవీకాలం జనవరి 18 ముగియనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్ రావటంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయింది.
తెలంగాణలో ప్రతి 897 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుందని ఈసీ తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల కానుండగా… నామినేషన్లను నవంబర్ 11వ తేదీ వరకు స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్:
ఎన్నికల షెడ్యూల్ : 09 -10 -2023
నోటిఫికేషన్ : 03 - 11 - 2023
నామినేషన్లకు చివరి తేదీ - 10.11.2023
నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13, 2023
నామినేషన్ల ఉపసంహరణ - నవంబర్ 15, 2023
పోలింగ్ - 30 నవంబర్, 2023
ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 3, 2023
తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా… 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. 27,798 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.