తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Damodar : బెల్ట్ షాపులను మూసివేయించండి - మంత్రి దామోదర ఆదేశాలు

Minister Damodar : బెల్ట్ షాపులను మూసివేయించండి - మంత్రి దామోదర ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

19 January 2024, 22:26 IST

google News
    • Minister Damodar Raja Narasimha News: బెల్ట్ షాపులను తక్షణమే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమావేశంలో సమీక్షించిన ఆయన… పలు అంశాలపై ఆరా తీసి తగిన ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి దామోదర సమీక్ష
మంత్రి దామోదర సమీక్ష

మంత్రి దామోదర సమీక్ష

Minister Damodar RajaNarasimha: సంగారెడ్డి జిల్లాలో బెల్టు షాప్ లు అన్ని మూసివేయాలని… వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. తాము అధికారంలోకి వస్తే, బెల్టు షాపులు అన్ని మూసేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకే… మంత్రి ఈ రోజు ఆదేశాలు జారీచేశారు.

ప్రభుత్వ భూములు, నీటి వనరులు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం మంత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ భూములు, నీటి వనరులు కబ్జాలకు గురవుతున్నాయని, వాటిని ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. అదే విధంగా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని, జిల్లాలో భూ కబ్జాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. అనుమతి లేని లేఅవుట్స్, నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

అక్రమ మైనింగ్ జరగకుండా చూడాలి......

అక్రమ మైనింగ్ జరగకుండా గట్టినిఘా పెట్టాలని, అక్రమ మైనింగ్ కార్యకలాపాలన్నింటిని నివారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఇల్లీగల్ మైనింగ్ పై తీవ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇల్లీగల్ మైన్స్ ని ఎన్నింటిని మూసివేశారు, ఎన్ని కేసులు బుక్ చేశారు? ఎన్ని వాహనాలను సీజ్ చేశారు, తదితర వివరాలనివేదికను 15 రోజుల్లోగా అందించాలని మైనింగ్ ఏడికి సూచించారు. జిల్లాలో ఎక్కడ బెల్ట్ షాపులు ఉండరాదని, బెల్ట్ షాపులన్నింటిని మూసివేఇంచాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఆదేశించారు.

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన వసతులకు సంబంధించి నివేదిక ఇచ్చినట్లయితే దృష్టి సారించి పరిష్కరిస్తామని మంత్రి సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ప్రతిపాదనలు పెట్టాలని డిపిఓ కు సూచించారు. విద్యాశాఖ, ఇంటర్మీడియట్ శాఖ ఇలా అధికారులతో సమీక్షిస్తూ పాఠశాలలు,కాలేజీల్లో వసతులు, సిబ్బంది, భవనాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన, చెక్కర, పౌరసరఫరాలు, సహకార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక, ఫిషరీస్, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ శాఖలపై సమీక్షించారు. రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. వాణి కాలేజీ బ్లాక్ ఒకటి త్వరగా స్వాధీనం చేయాలని సంబంధిత ఏజెన్సీని కోరినా పూర్తిచేసి ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను పనుల పురోగతిపై ఆరా తీయగా, చివరి దశలో ఉన్నదనీ త్వరలో ఇస్తామని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, విద్యా, వైద్యం ఆరోగ్యానికి ప్రాధాన్య నిస్తున్నదన్నా రు. అధికారులు అందరూ పేద ప్రజల సంక్షేమానికి, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్,అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి,అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్ఓ, ఆర్డీవోలు పాల్గొన్నారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి

తదుపరి వ్యాసం