Medak Crime : ఇద్దరి భార్యల మధ్య గొడవలు- సుపారీ ఇచ్చి మొదటి భార్యను హత్య చేయించిన భర్త!
22 February 2024, 21:45 IST
- Medak Crime : ఇద్దరు భార్యల మధ్య గొడవలతో విసిగిపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. సుపారీ ఇచ్చి మొదటి భార్యను హత్య చేయించాడు.
సుపారీ ఇచ్చి మొదటి భార్యను హత్య చేయించిన భర్త
Medak Crime : ఇద్దరి భార్యల మధ్య తరచూ జరుగుతున్న గొడవలతో వేగలేక తాళి కట్టిన భర్తే ఇరవై వేలు సుపారీ ఇచ్చి మొదటి భార్యను హత్యా చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన మెదక్ జిల్లా(Medak Crime ) హవేలీ ఘన్ పూర్ మండలం తొగుటలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొగుట గ్రామానికి చెందిన సంగమణి ఈ నెల 11న అర్ధరాత్రి దారుణ హత్యకు గురైయింది. మృతురాలి భర్త మంద ఆశయ్యకు ఇద్దరు భార్యలు సంగమణి, మంజుల ఉన్నారు. వీరి ఇద్దరి మధ్య తరచూ ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతుండేవి. అంతేకాకుండా ఆశయ్య రెండో భార్య మంజులతో చనువుగా ఉండడం సంగమణికి నచ్చేది కాదు. దీంతో ఇంట్లో గొడవలు ఇంకా పెరిగిపోయాయి. నిత్యం ఇంట్లో జరిగే గొడవలతో విసుగు చెందిన ఆశయ్యకు ప్రశాంతత లేకుండా పోయింది. సంగమణిని చంపితే ఇంట్లో గొడవలు తగ్గుతాయని ఆశయ్య భావించి దానికోసం ఒక పథకం రచించాడు.
సంగమణిని హత్య చేయడానికి రూ.20 వేలకు ఒప్పందం
ఆ పథకం ప్రకారం అదే గ్రామానికి చెందిన మహేష్ తో సంగమణిని హత్య చేయడానికి రూ. 20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్ లో భాగంగా ఈ నెల 11న ఆశయ్య రెండో భార్య మంజులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11:00 గంటల సమయంలో మహేష్, అతని స్నేహితుడు శివకుమార్ తో కలిసి ఆశయ్య చెప్పినట్లుగా వంట గదిలో పొగ బయటకు వెళ్లే గొట్టం ద్వారా ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగమణి వద్దకు వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న సంగమణిని ఇంట్లో ఉన్న ఈలపీటతో గొంతు, ముఖంపై కోసి చంపారు(Supari Murder). అనంతరం మహేష్, శివ కుమార్ లు కలిసి బెడ్ రూమ్ బీరువాలో ఉన్న రూ. 20 వేల నగదు, సంగమణి మెడలో ఉన్న నల్లపూసల గొలుసు, పుస్తె, ఆమె కుడి చెవి కమ్మను తీసుకొని వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మహేష్, శివ కుమార్ లను అనుమానితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వీరి ఇద్దరితో పాటు ఆశయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. హత్య మిస్టరీని ఛేదించడంతో హవెళి ఘనపూర్ ఎస్సై ఆనంద్ గౌడ్, సిబ్బందిని అభినందించారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి
త్రాగు నీటి కోసం బావి దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లిలో చోటుచేసుకుంది. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కొండి అనిత (32) వ్యవసాయం పనులు చేసుకుంటూ, మేకల కాస్తూ జీవనం సాగిస్తుంది. కాగా బుధవారం రోజు మేకలు కాస్తున్న సమయంలో దాహంగా ఉండటంతో నీళ్ల కోసం బాటిల్ తీసుకొని సమీపంలోని వ్యవసాయ బాయి వద్దకు వెళ్లింది. నీళ్ల కోసం వెళ్లిన అనిత ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమెతో పాటు మేకలు కాస్తున్న మరో వ్యక్తి బావి దగ్గరికి వెళ్లి చూడగా అనిత చెప్పులు, వాటర్ బాటిల్ కనిపించాయి. దీంతో ఆమె బావిలో పడిందని భావించి చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.
హెచ్.టి.తెలుగు రిపోర్టర్, మెదక్