తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

HT Telugu Desk HT Telugu

12 May 2024, 16:44 IST

google News
    • Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఈ నాలుగు ప్రమాదాల్లో విద్యుత్ షాక్ కారణంగా నలుగురు మృతి చెందారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం
ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం విద్యుత్ షాక్ కు గురై వేర్వేరు సంఘటనలలో నలుగురు దుర్మరణం చెందారు. విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్ కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ఆకులలింగాపూర్ గ్రామానికి చెందిన తుమ్మల గాలమ్మ ఇంట్లో కరెంట్ లేకపోవడంతో గ్రామంలో మెకానిక్ గా పనిచేస్తున్న యేసయ్యను రిపేర్ కోసం పిలిచింది. దీంతో యేసయ్య వచ్చేటప్పుడు తనతో పాటు గైని రాజు (29) ను కూడా తీసుకొని వచ్చాడు. గాలమ్మ ఇంట్లో కరెంట్ లేకపోవడంతో రాజును స్తంభం ఎక్కించి యేసయ్య మరమ్మతులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభానికి కరెంట్ ఉండటంతో షాక్ కు గురై స్తంభం మీద నుంచి కింద పడి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సంవత్సరం కిందట రాజు కుటుంబంలో ఒకరు మృతి చెందారు. ఇప్పుడు రాజు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

సంగారెడ్డి జిల్లాలో మరొకరు

విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రామచంద్రాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ లో మహేష్ (37) ఔట్ సోర్సింగ్ పని చేస్తున్నాడు. కాగా శనివారం అశ్విన్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో బోర్ మోటర్ చెడిపోయిందని రిపేర్ చేయడానికి వెళ్లాడు. కాగా అతడు సంపులోకి దిగి రిపేర్ చేయడం ప్రారంభించాడు. కాగా సంపులో నీరు ఎక్కువగా ఉండటం మహేష్ గమనించలేదు. దీంతో రిపేర్ చేస్తుండగా విద్యుత్ తీగలు నీటికి తగలడంతో మహేష్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి మరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సిద్దిపేటలో

నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో డ్రిల్లింగ్ పని చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన పరశురాములు (30) గ్రామంలో వ్యవసాయంతో పాటు ప్లంబర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా శనివారం అదే గ్రామానికి చెందిన నాగరాములు అనే వ్యక్తి నూతన ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఆ ఇంటిలో డ్రిల్లింగ్ పని చేయడానికి పరశురాములు వెళ్లాడు. దీంతో ఇంటిపైన ఉన్న విద్యుత్ వైర్లను గమనించకుండా ఇంటికి డ్రిల్లింగ్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పరశురాములు మృతిచెందాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని మరణంతో ఆ కుటుంబం దిక్కులేని వారయ్యామని భోరున విలపిస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మెదక్ లో

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా చేగుంట మండలం చెట్లతిమ్మాయిపల్లిలోని నడిమి తండాకు చెందిన మాలోత్ రమేష్ (33)కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. కాగా రమేష్ కుటుంబం వారికున్న రేకులషెడ్లో నివసిస్తున్నారు. దీంతో వారు నివసిస్తున్న షెడ్ వెనకాల ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఒక్కసారిగా పేలి మంటలు రావడంతో ఇంట్లోని ఫ్యాన్ కాలిపోయింది. దీంతో రమేష్ ఏం జరిగిందే తెలుసుకుందామని డోర్ ఓపెన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. అతడు పడిపోతుండగా పట్టుకున్న భార్య అమృతకు గాయాలయ్యాయి. వెంటనే రమేష్ ను చికిత్స నిమిత్తం నార్సింగిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం