Medak Rains : అకాల వర్షానికి వణికిపోయిన ఉమ్మడి మెదక్ జిల్లా - నలుగురు మృతి-four people died in various incidents due to heavy rains in the medak district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Rains : అకాల వర్షానికి వణికిపోయిన ఉమ్మడి మెదక్ జిల్లా - నలుగురు మృతి

Medak Rains : అకాల వర్షానికి వణికిపోయిన ఉమ్మడి మెదక్ జిల్లా - నలుగురు మృతి

HT Telugu Desk HT Telugu
May 08, 2024 09:51 AM IST

Heavy Rains in Telangana : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాటు కారణంగా పలువురు మృతి చెందారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు

Rains in Medak District : మండే వేసవిలో కురిసిన అకాల వర్షంతో ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు వణికారు. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

పండ్ల తోటలు, కూరగాయల తోటలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలకు అమ్మటానికి తెచ్చిన వడ్లు నీటిలో మునగడంతో రైతన్నలకు తీవ్ర నష్ట కలిగింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోవటతో చాలా ప్రాంతాల్లో గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ పునరుద్ధరణకు చాలా సమయం పట్టింది.

గోడ కూలి ఇద్దరు మృతి.....

గోడ కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి, రాయిలాపూర్ గ్రామాల్లో జరిగింది. కోళ్ల ఫారం కోసం గోడను కడుతున్న ఇద్దరు కార్మికులు… అదే గోడ కింద మరణించిన హృదయవిదారక సంఘటన పలువురుని కదిలించింది. మృతులను సుబ్రహ్మణ్యం (41), మాదాసు నాగు (36)గా గుర్తించారు.

పిడుగుపడి మరో ఇద్దరు.......

సిద్దిపేట జిల్లాలోని కుకునూరుపల్లి మండల కేంద్రంలో రైతు కుమ్మరి మల్లేశం (36) ఫై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బావి దగ్గరికి వెళ్లిన మల్లేశం వర్షం రావటంతో చెట్టుకింద నిలుచున్నాడు. పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మల్లేశంకు భార్య ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.

మరో సంఘటనలో పశువుల మేపటానికి వెళ్లిన రైతు బోయిని పాపయ్య (52) పిడుగుపాటుతో మరణించాడు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలం ఎర్రారం గ్రామానికి చెందిన బోయిని పాపయ్య ఊరి చివర పశువులను మేపుతున్నాడు. ఆ ప్రాంతంలో ఉరుములుతో కూడిన వర్షం వస్తుండటంతో… పాపయ్య మీద పిడుగు పడింది. ఈ సంఘటనతో పాపయ్య జేబులో ఉన్న ఫోన్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ మండలం నాగదర్ గ్రామానికి చెందిన రైతు వడ్డే మొగులయ్య కు చెందిన మూడు మేకలు పిడుగుపాటుతో మరణించాయి. రూ. 30 వేల నష్టం జరిగిందని రైతు వాపోయాడు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం