Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు-leopard spotted in medak district forest officials warn to be alert ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Leopard In Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

HT Telugu Desk HT Telugu

Leopard Spotted in Medak District: మెదక్ జిల్లాలోని చేగుంట మండల పరిధిలో చిరుత సంచారాన్ని గుర్తించారు. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామ వాసులు… అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.

ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం

Medak District News: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి(Leopard) సంచరిస్తున్నట్లు గుర్తించామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగరాణి తెలిపారు. ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్స్ లో గురువారం రాత్రి ఫారెస్ట్ నర్సరీలో చిరుత పులి సంచరిస్తున్నట్లు రికార్డు అయ్యిందని ప్రకటించారు.

చిరుత సంచారం వెలుగులోకి రావటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. భయాందోళనకు గురి కావొద్దన్నారు. ఇబ్రహీంపూర్ అడవిలో నుంచి ఆకు తీసుకురావటంతో పాటు వేరే అవసరాలున్నా ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరించారు.

చిరుత పులి (Leopard)సంచరిస్తున్న కారణంగా ఇబ్రహీంపూర్ పరిధిలోని బోనాల గోవిందా పూర్, కిష్టాపూర్, పులిమామిడి, చిట్టోజ్ పల్లి, రుక్మాపూర్, రాంపూర్, కన్యారం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అడవిలోకి ఎవరూ వెళ్లొద్దన్నారు.

నీటి కోసమే నర్సరీలోకి .....

నర్సరీలోకి వచ్చిన చిరుత నీరు తాగి అక్కడే కొద్దిసేపు సేద తీరినట్టు అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్స్ లో…. ఒక చుక్కల జింక కూడా వచ్చినట్లు రికార్డు అయింది. నీరు తాగి వెళ్లినట్లు గుర్తించారు.

సంగారెడ్డిలో చిరుత పులి దాడిలో ఆవు మృతి......

చిరుత పులి(Leopard) దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండా శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం… మాణిక్ నాయక్ తండాకు చెందిన కిషన్ రోజులాగానే తన పశువులను మంగళవారం సాయంత్రం తర్వాత బావి దగ్గర కట్టేసి ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం వెళ్లి చూసేసరికి ఆవు రక్తపు గాయాలతో మృతి చెంది ఉంది. కాగా మరో రెండు పశువులు కూడా గాయాపడ్డాయి. చిరుత దాడిలోనే ఆవు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.

గత కొన్నేళ్లుగా తండా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ పశువులను బలి తీసుకున్న సంఘటనలు ఉన్నాయని తండావాసులు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే మాణిక్ నాయక్ తండా శివారులోనే చిరుత దాడిలో ఓఆవు మృతిచెందిందని తెలిపారు. బాధితుడికి పరిహారం అందించడంతోపాటు చిరుతను వీలైనంత త్వరగా బంధించాలని తండా వాసులు కోరుతున్నారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.

సంబంధిత కథనం