Weather Updates: 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్
27 April 2022, 8:47 IST
- తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు పెరిగిపోతున్నాయి. వారం రోజులుగా ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి చిరుజల్లులు కురిస్తున్నప్పటికీ.. మరోవైపు ఎండలు మండుతూనే ఉన్నాయి.
మండుతున్న ఎండలు
ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతోంది. ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది . మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. నైరుతి, దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఉపరితల ద్రోణి ప్రభావం, ట్రోపో వాతావరణంలో గాలుల ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండనుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఇక తుని, విశాఖ, ప్రకాశం, అమరావతిలో పగటి ఉష్ణోగ్రతల స్థాయి ఎక్కువగా ఉంది. ఇక సీమ జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అకాశం ఉంది. ఇక అత్యధికంగా అనంతపురంలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, నంద్యాల, తిరుపతిలోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఎక్కువ మోతాదులో మంచినీళ్లను తీసుకోవాలి సలహా ఇస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో గొడుగులు వాడటం మంచిదని చెబుతున్నారు.
టాపిక్