తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu Updates : ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేది అప్పుడే...! - 'రైతుబంధు' స్కీమ్ తాజా అప్డేట్ ఇదే

Rythu Bandhu Updates : ఆ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేది అప్పుడే...! - 'రైతుబంధు' స్కీమ్ తాజా అప్డేట్ ఇదే

25 January 2024, 16:42 IST

    • Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమ ప్రక్రియలో ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతోంది. సంక్రాంతి పండగ తర్వాత ఎక్కువ విస్తీరణం గల రైతుల ఖాతాల్లోకి కూడా డబ్బులు జమ అవుతున్నాయి. 
రైతుబంధు నిధులు
రైతుబంధు నిధులు (https://rythubandhu.telangana.gov.in)

రైతుబంధు నిధులు

Rythu Bandhu Scheme Updates: గత కొంతకాలంగా రైతుబంధు నిధుల విషయంపై చర్చ జరుగుతోంది. పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వ రావటంతో ఈ స్కీమ్ పై కాస్త చర్చ జరిగినప్పటికీ... ఈసారికి పాత పద్ధతిలోనే నిధులను జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఫలితంగా ఈసారి రైతుబంధు స్కీమ్ కిందనే పంట పెట్టుబడి సాయం అందుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Sircilla News : రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్

ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

Hyderabad Finance Fraud : హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో ఫైనాన్స్ సంస్థ, రూ.200 కోట్లు స్వాహా!

TS Cabinet Decisions : ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కలెక్టర్లకే, సన్న వడ్లకే రూ.500 బోనస్- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

గత ప్రభుత్వం జమ చేసిన విధంగానే తక్కువ విస్తీరణ నుంచి ఎక్కువ విస్తీరణం గల రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతూ వచ్చింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలే కాకుండా రైతుల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... నిధులను సమీకరిస్తున్న సర్కార్ రైతుల ఖాతాల్లోకి నెమ్మెదిగా జమ చేస్తూ వచ్చింది. అయితే సంక్రాంతి తర్వాత పరిస్థితి మారింది. ఎకరానికి పైబడిన రైతుల ఖాతాల్లోకి కూడా డబ్బులు జమ అయ్యాయి. రెండు ఎకరాలలోపు ఉన్న వారి కూడా నిధులు అందాయి. మొత్తం 69 లక్షల రైతులకు ఈ స్కీమ్ కింద డబ్బులు అందాల్సి ఉండగా… ఇప్పటివరకు 45లక్షలకు పైగా రైతులకు చెల్లించినట్లు వ్యవసాయశాఖ చెబుతోంది. వీరి ఖాతాల్లో రూ 2,450 కోట్లుకు పైగా జమ చేశారు.

తాజా పరిస్థితి ఇదే….

రైతుబంధు చెల్లింపులను రాష్ట్ర సర్కారు గతేడాది డిసెంబరులో ప్రారంభించింది. ఎకరం లోపు ఉన్న వారికి తొలుత డబ్బులను జమ చేసింది. ఇందులో కూడా గుంటలవారీగా జమ చేయాలని నిర్ణయించింది. క్రమంగా విస్తీర్ణం పెంచుకుంటూ వచ్చింది. సంక్రాంతి పండగ తర్వాత మరింత వేగం పెరిగింది. ప్రస్తుతం రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది కూడా దాదాపు 80 శాతం పూర్తి అయినట్లు తెలిసింది. ఈ కేటగిరి పూర్తికాగానే నాలుగు నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. మొత్తంగా చూస్తే ఈ నెలాఖారులోపు ఐదు ఎకరాల విస్తీరణం గల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.

తాజా పరిస్థితిపై రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలానికి చెందిన వ్యవసాయశాఖ అధికారులను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు సంప్రదించింది. నిధులు జమపై ఆరా తీయగా… ప్రస్తుతం రెండు నుంచి 3 ఎకరాల లోపు మధ్య ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. నెలాఖారులోపు ఎక్కువ విస్తీరణం గల రైతుల ఖాతాల్లోకి కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇక ఐదు ఎకరాలకు మించి ఉన్న రైతుల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి రైతుబంధుకు పరిమితి విధిస్తారనే చర్చ జోరుగా నడిచింది. గత ప్రభుత్వం ఎలాంటి సీలింగ్ విధించకుండా నిధులను జమ చేసింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో ఐదు లేదా పది ఎకరాలలోపు మాత్రమే రైతుబంధును వర్తింపచేసే దిశగా నిర్ణయం తీసుకోవచ్చనే వార్తలు వినిపించాయి. ఇది చర్చ వరకు పరిమితంకాగా…. దీనిపై సర్కార్ నుంచి ఎలాంటి ఆదేశాలు మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే ఐదెకరాలకు మించి విస్తీర్ణం ఉన్న రైతులకు ఫిబ్రవరిలో రైతుబంధు నిధులను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు స్కీమ్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ. 5వేలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా... కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ పై ప్రకటన చేసింది. రైతుభరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడనుంది.

తదుపరి వ్యాసం