Nalgonda Congress MP Ticket : నల్గొండ ఎంపీ టికెట్ పై యువనేత గురి..! టెన్షన్ లో మరో నాయకుడు - ఏం జరగబోతుంది..?
03 January 2024, 13:43 IST
- Lok Sabha Elections 2024 Updates: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ కాంగ్రెస్ నేతలు… ఎంపీ టికెట్ పై గురి పెట్టారు. ఎలాగైనా పార్టీ తరపున బరిలో నిలిచి.. గెలవాలని చూస్తున్నారు. ఇందుకోసం ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు.
నల్గొండ ఎంపీ టికెట్ పై యువనేత గురి.
Lok Sabha Elections 2024 Updates:రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ లో పార్లమెంటు ఎన్నికల ఊపు కనిపిస్తోంది. మరి కొద్ది నెలల్లోనే జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ కోసం నాయకులు అపుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్ సభానియోజకవర్గాలు ఉన్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. నల్గొండ నుంచి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ మే నెల్లలో జరగనున్న ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం సైతం గట్టి అభ్యర్థుల వెదుకులాటలో ఉంది.
నల్గొండ టికెట్ పై ఇద్దరు నేతల గురి
నల్గొండ ఎంపీ టికెట్ కు కుందూరు రఘువీర్ రెడ్డితో పాటు, పటేల్ రమేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల సమయంలో కొందరు ఆశావాహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో వివిధ హామీలు ఇచ్చారు. వాటిలో ఎంపీ టికెట్ల హామీ కూడా ఒకటి. శాసన సభ ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకూ టికెట్ కోసం ప్రయత్నించిన సూర్యాపేట నేత పటేల్ రమేష్ రెడ్డిని టికెట్ పోటీ నుంచి తప్పించేందుకు, అప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేసిన నామినేషన్ ను విత్ డ్రా చేయించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తంటాలు పడి, రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. శాసన సభ ఎన్నికల బరినుంచి తప్పుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లోక్ సభా నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇచ్చి పోటీకి పెడతామన్నది ఆ హామీ సారాంశం. రాత పూర్వక భరోసా లభించడంతో పటేల్ రమేష్ రెడ్డి తన నామినేషన్ విత్ డ్రా చేసుకుని, సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. రాత పూర్వక హామీ ఇచ్చిన వారిలో అప్పటి నల్గొండ ఎంపీగా ఉండిన ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్ర సీఎం, టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి దగ్గరి అనుచరుడైన పటేల్ రమేష్ రెడ్డికి ఇచ్చిన హామీని ఇపుడు కాంగ్రెస్ నాయకత్వం నిలబెట్టుకోవాల్సి ఉంది. ఈ లెక్కన నల్గొండ ఎంపీ టికెట్ పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాల్సి ఉంది. కానీ, టికెట్ రేసులోకి మరో నాయకుడు కూడా వచ్చారు.
టికెట్ ప్రతయ్నతాల్లో రఘువీర్ రెడ్డి
పార్టీ నాయకత్వం ఇచ్చిన రాతపూర్వక హామీపై పటేల్ రమేష్ రెడ్డి భరోసాతో ఉన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి సైతం నల్గొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. శాసన సభ ఎన్నికల సమయంలోనే ఆయన మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరని కారణంగా రఘువీర్ రెడ్డిని పక్కన పెట్టి మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి పక్కకు తప్పుకోవడంతో ఆయన రెండో తనయుడు కుందూరు జైవీర్ రెడ్డికి టికెట్ కేటాయించగా, ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా, రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ హామీ ఇవ్వడం ద్వారానే ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి పక్కకు తప్పించారన్న అభిప్రాయం కూడా ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఊపు మీదున్న సమయంలో వస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుందన్న విశ్వాసంతో ఎంపీ టికెట్ కోసం పోటీ పెరిగిందంటున్నారు. నల్గొండ లోక్ సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు కాంగ్రెస్ చేతిలోఉండగా, ఒక్క సూర్యాపేట మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన అన్ని సెగ్మెంట్లలో శాసన సభ ఎన్నికల్లో 50వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. స్వల్ప కాల తేడాతో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇది విజయానికి దోహదపడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కుందూరు రఘువీర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకరు దగ్గరి అనుచరుడు, మరొకరు సన్నిహిత మిత్రుడు కాడంతో పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు..? ఎవరిని నల్గొండ ఎంపీ టికెట్ వరిస్తుంది..? అన్న అంశాలు ఆసక్తిగొల్పుతున్నాయి.
(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ జిల్లా ప్రతినిధి )