తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dasara 2024 : గొర్రెలను కొనడానికి సంతకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి!

Dasara 2024 : గొర్రెలను కొనడానికి సంతకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి!

06 October 2024, 17:51 IST

google News
    • Dasara 2024 : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ దసరా. ఈ పండగ నాడు పల్లెల్లో బొడ్రాయి వద్ద జంతుబలి ఇవ్వడం ఆనవాయితీ. అంతేకాకుండా చాలామంది గ్రూప్‌గా ఎర్పడి జంతు బలి ఇస్తారు. దీంతో గొర్రెలకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్‌ను దళారులు క్యాష్ చేసుకుంటున్నారు.
సంతలో పశువులు
సంతలో పశువులు (HT Telugu)

సంతలో పశువులు

తెలంగాణలోని ప్రతి పల్లెలో దసరా పండగ నాడు జంతుబలి ఇస్తారు. ఇంతేకాకుండా కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులు కలిసి.. జంతుబలి చేస్తారు. ఆ తర్వాత పోగులు వేసుకొని మాంసాన్ని పంచుకుంటారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామంలో తక్కువలో తక్కువ 50 నుంచి 100 గొర్రెలు, మేకలను బలి ఇస్తారు. దీంతో దసరా పండగకు గొర్రెలు, మేకలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

ఈ డిమాండ్‌ను కొందరు దళారులు, వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజలను అడ్డంగా మోసం చేస్తున్నారు. మోసపోయామని కూడా తెలియకుండా దళారులు తీరు ఉంటుంది. అందుకే పశువులను కొనడానికి సంతకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, నర్సంపేట, గూడూరు, మల్లంపల్లి, నెక్కొండ, రఘునాథపల్లి సంతలు పెద్దవి. ఇక్కడి వేలల్లో గొర్రెలను వ్యాపారానికి తోలుకొస్తారు.

మోసపోవద్దంటే ఇలా చేయండి..

1.సంతల్లో మారుబేరం (వ్యాపారం చేసేవారు) ఎక్కువగా ఉంటారు. వారు పెంపకందారుల నుంచి కొనుగోలు చేసి.. సంతలకు తీసుకొచ్చి అమ్ముతారు. వీరివద్ద కొనుగోలు చేస్తే.. డబ్బులు ఎక్కువ అవుతాయి.

2.కొందరు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తారు. సంతలోకి అడుగుపెట్టగానే మాటలు కలిపి.. సాయం చేస్తున్నట్టు నటిస్తారు. వారికి తెలిసిన గొర్రెల మంద దగ్గరకు తీసుకెళ్లి ఎక్కువ ధరకు కొనుగోలు చేసేలా మోటివేట్ చేస్తారు. వీరిని అస్సలు నమ్మొద్దు.

3.సంతలకు పెంపకందారులు కూడా మందలను తోలుకొని వస్తారు. వారి వద్ద కొనుగోలు చేస్తే బెటర్. తక్కువ ధరతో పాటు నాణ్యమైనవి దొరుకుతాయి.

4.సంతలకు వెళ్లడం వీలు కాకపోతే.. గ్రామాల్లో కొనడం మంచిది. గ్రామాల్లోని గొల్ల, కురుమ వారి ఇళ్లలో గొర్రెలు, మేకలు పెంచుతారు. ఇళ్లల్లో పెరిగినవి కాబట్టి బాగుంటాయి.

5.సంతల్లో రహదారి రాసేవారితోనూ జాగ్రత్తగా ఉండాలి. వారు కూడా దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జేబుకు చిల్లు తప్పదు.

6.డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. బక్కచిక్కిన గొర్రెలను సంతలకు తోలుకొస్తారు. వాటిని అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాటిని కొనుగోలు చేస్తే.. పప్పులో కాలేసినట్టే.

7.రహదారి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లు.. వ్యాపారులతో కుమ్మక్కై.. మొత్తం డబ్బులు కొనుగోలుదారులతో పెట్టిస్తారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండి.. నిబంధనల ప్రకారం ఇపువైపులా చెల్లించేలా చూసుకోవాలి.

తదుపరి వ్యాసం