తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Caste Census : సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా, మూడ్రోజలు పాటు ఇంటింటా స్టిక్కరింగ్

TG Caste Census : సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా, మూడ్రోజలు పాటు ఇంటింటా స్టిక్కరింగ్

HT Telugu Desk HT Telugu

06 November 2024, 19:34 IST

google News
  • TG Caste Census : తెలంగాణలో కులగణనకు అటంకాలు ఎదురవుతున్నాయి. టీచర్లను ఎన్యూమరేటర్లుగా నియమించడంలో జాప్యం జరగడంతో సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా పడిది. మూడ్రోజుల పాటు ఇంటంటా స్టిక్కరింగ్ వేసి కుటుంబాల సంఖ్యను తేల్చనున్నారు.

సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా, మూడ్రోజలు పాటు ఇంటింటా స్టిక్కరింగ్
సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా, మూడ్రోజలు పాటు ఇంటింటా స్టిక్కరింగ్

సమగ్ర సర్వే ఈ నెల 9కి వాయిదా, మూడ్రోజలు పాటు ఇంటింటా స్టిక్కరింగ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. నేటి నుంచి ఇంటింటా సమగ్ర సర్వే చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎన్యూమరేటర్లుగా టీచర్లను నియమించడంలో జాప్యం జరగడం వల్ల సమగ్ర సర్వే ఈనెల 9 కి వాయిదా పడింది. 6 నుంచి మూడు రోజులపాటు ఇంటింటా స్టిక్కరింగ్ వేసి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.‌

తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలు సేకరించేందుకు సర్కార్ సర్వసన్నద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణనను పూర్తిచేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. గత వారం రోజులుగా సమగ్ర సర్వేపై ప్రభుత్వం హడావిడి చేస్తుంది. నవంబర్ 6 నుంచి ఇంటింటా సమగ్ర సర్వే చేపడుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అసలు సర్వే మాత్రం ఈనెల 9 నుంచి మొదలు కానుంది.

అందరూ ఆరు నుంచే ఇంటింటా సర్వే ప్రారంభం అవుతుందని భావించారు. కానీ సమగ్ర సర్వే చేసే టీచర్లను ఎన్యూమరేటర్ లుగా నియమించడంలో జాప్యం కావడంతో సమగ్ర సర్వే 9 నుంచి చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, ఉద్యోగులు అధికారులు ఇంటింటా స్టిక్కరింగ్ వేసి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెల్చే పనిలో నిమగ్నమయ్యారు.‌ ఒక్క ఇంట్లో తండ్రి, పెళ్ళి అయిన ఇద్దరు కొడుకులు ఉంటే మూడు కుటుంబాలుగా మూడు స్టిక్కర్లు వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, చిగురుమామిడి మండలం రేకొండలో స్టిక్కరింగ్ వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపూల్ దేశాయ్ పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

సర్వేకు సహకరించండి... కలెక్టర్

ఇంటింటా సమగ్ర సర్వే కు ప్రతి ఒక్కరు సహకరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎవరికీ వెల్లడించమని స్పష్టం చేశారు. సర్వేలో ప్రజలు ఇచ్చే వివరాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్యూమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ,ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ ,కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని, అందువలన తప్పు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఎంతో దోహదపడుతుందని తెలిపారు. సర్వేకు ప్రభుత్వం రూపొందించిన 75 కాలమ్స్ లో వివరాల సేకరణ చేస్తారని, ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకుని ఎన్యుమరేటర్లకు అందుబాటులో ఉండి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితులలో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సూపర్వైజర్లు, లేదా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. సర్వే ఫారంలో పూర్తి వివరాలను నింపాలని, ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన డేటాను ఆన్ లైన్ చేస్తామని తెలిపారు.

175 కుటుంబాలకు ఒక ఎన్యూమరేట్ బ్లాక్

ఇంటింటా సమగ్ర సర్వే కోసం 175 కుటుంబాలకు ఒక ఎన్యూమరేట్ బ్లాక్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బ్లాక్ కు ఒక ఎన్యూమరేటర్ ను నియమించారు. పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ను ఏర్పాటు చేశారు. సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి మండలానికి ప్రతి మున్సిపాలిటికి జిల్లా స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. కరీంనగర్ జిల్లాలో 1958 ఎన్యూమరేట్ బ్లాక్స్, 1964 ఎన్యూమరేటర్లను, సర్వే పరిశీలనకు 207 సూపర్వైజర్ లను ఏర్పాటు చేశారు.‌ వారందరికీ ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేసి సర్వేకు సర్వసన్నద్ద చేశారు.

తేలనున్న అప్పులు, ఆస్తుల వివరాలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా సమగ్ర సర్వే తో ప్రతి కుటుంబం యొక్క ఆస్తులు, అప్పులు, సామాజిక స్థితిగతులు, రాజకీయ నేపథ్యం బయటపడనుంది. ఉద్యోగం ఉపాధి వివరాలతో పాటు 112 అంశాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. సర్వే కోసం ప్రస్తుతం 8 పేజీలతో తయారు చేసిన 75 ప్రశ్నావళిలో 59 ప్రశ్నలు ప్రధానమైనవి, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలను ఎన్యూమరేటర్ లు సేకరించనున్నారు. కులగణన పేరుతో ప్రభుత్వం కుటుంబం యొక్క ఆస్తులు, అప్పుల వివరాలు రాజకీయ నేపథ్యం తెలుసుకోవడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో తేల్చేందుకు కుటుంబాల యొక్క అన్ని వివరాలు సేకరించడం సమంజసం కాదంటున్నారు రాజకీయ పార్టీలతో పాటు సామాజిక వేత్తలు. అధికారులు మాత్రం సర్వేలో కుటుంబాలు వెల్లడించే వివరాలను గోప్యంగా ఉంచుతామని... ఎలాంటి అపోహాలకు తావులేదని స్పష్టం చేస్తున్నారు.

9 నుంచి స్కూళ్లకు హాఫ్ డే

ముందుగా గ్రామ పంచాయితీ, మున్సిపల్ సిబ్బంది, ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లతో సమగ్ర సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రస్తుతం సేకరించి వివరాలు పొందుపర్చడం వారి వల్ల కాదని భావించిన ప్రభుత్వం టీచర్లను ఎన్యూమరేటర్లుగా నియమించింది. ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేసే టీచర్లను ఎన్యూమరేటర్లుగా నియమించడం, ఈనెల 9 నుంచి సమగ్ర సర్వే ప్రారంభం అవుతుండడంతో పిల్లలకు హాఫ్ డే స్కూల్ నిర్వహిస్తారు. అందుకు ప్రభుత్వం ఈనెల తొమ్మిది నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం వరకు టీచర్లు స్కూల్ డ్యూటీ చేసి లంచ్ తర్వాత ఇంటింటా సమగ్ర సర్వేతో వివరాలు సేకరించాల్సి ఉంటుంది. కుటుంబాల వారీగా 9 నుంచి ఈనెల 30 వరకు సమగ్ర సర్వే నిర్వహిస్తారు. సర్వేలో 112 అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించనున్నారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అంశాలతోపాటు కులం వివరాలు సేకరిస్తారు.

రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం