Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం కూల్చబోం, తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుంది- బండి సంజయ్
23 November 2024, 21:41 IST
Bandi Sanjay : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావంత తెలంగాణపై ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణంగానే మహాయుతికి 225 సీట్లకు పైగా వచ్చాయన్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం కూల్చబోం, తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుంది- బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీగా మారిందని... మహారాష్ట్ర ఫలితాలతో స్పష్టమయిందన్నారు. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు.
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుందుబి మోగించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కమలనాథుల సంబరాలు అంబరాన్ని అంటాయి. మహాశక్తి ఆలయం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి, టపాసులు కాల్చి విజయోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని మరాఠి ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం, అవసరం బీజేపీకి లేదని చెప్పిన బండి సంజయ్.... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూల్చుకుంటారని చెప్పారు.
కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలే కారణం
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 225 స్థానాలు గెలుపొందడం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మూడు రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అబద్ధాలు ప్రచారం చేసి మరాఠి ప్రజల తిరస్కారానికి గురైందని విమర్శించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలు మహారాష్ట్రలో ఖర్చు చేసిందని అయినా ప్రజలు ఆ పార్టీని నమ్మలేదు అన్నారు. మహారాష్ట్ర ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉంటుందని స్పష్టం చేశారు.
పీపుల్స్ ఫల్స్ సర్వే సక్సెస్
తెలంగాణలోని సర్వే సంస్థ ‘‘పీపుల్స్ పల్స్’’ చెప్పినట్లుగా ఎన్డీఏ కూటమికి అద్బుతమైన మెజారిటీ లభించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మ్యాజిక్ ఫిగర్ దాటి 225పైగా సీట్లలో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని తెలిపారు. బీజేపీ గతంలో 105 స్థానాలు గెలిస్తే...ఈసారి 130 గెలుచుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గతం కంటే తక్కువ సీట్లు వచ్చాయ్...కాంగ్రెస్ కూటమి అడ్రస్ గల్లంతయిందని విమర్శించారు. ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు...నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందని ఒకసారి అధికారంలోకి వచ్చాక రెండోసారి మళ్లీ రావాలంటే మెజారిటీ తగ్గడం చూశాం... కానీ మహారాష్ట్రలో గతంకంటే ఎక్కువ మెజారిటీ సీట్లు ఎన్డీఏ కూటమికి రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మలేదని, మహారాష్ట్ర ప్రజలు ఐక్యత ప్రదర్శించారని తెలిపారు. హిందుత్వవైపు నిలబడ్డారని చెప్పారు.
కాంగ్రెస్ లో లుకలుకలు
ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలే. లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడం తథ్యం. ఓటు అనే ఆయుధంతో కాంగ్రస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక్క పని కావడం లేదని ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పార్టీలో లుకలుకలు రాబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేం కూల్చబోం...మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ అవకాశం కూడా ఇవ్వరు... ఆ అవసరం కూడా మాకు లేదు...కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వాళ్ల ప్రభుత్వాన్ని కూల్చేస్తారని జోస్యం చెప్పారు.
కులగణన బోగస్
కులగణన పెద్ద బోగస్ అని బండి సంజయ్ ఆరోపించారు. కులగణన ఫారంలపై పెన్సిల్ తో రాస్తున్నారని, పెన్నుతో సంతకం తీసుకుంటున్నారు...ఎందుకంటే పెన్సిల్ తో రాస్తే... తరువాత కాంగ్రెస్ పార్టీ తనకు అనుగుణంగా మార్పు చేసుకోవాలనుకుంటుందని తెలిపారు. అందుకే ప్రజలు సహకరించడం లేదు. చాలాచోట్ల నిలదీస్తున్నారు. నేనడుగుతున్నా కేసీఆర్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది కదా... ఆ రిపోర్ట్ బయటపెట్టాలి... ఆ రిపోర్ట్ లేకపోతే.. దానికైన సొమ్మంతా కేసీఆర్ నుండి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈవీఎంలు మా చేతుల్లో ఉంటే జార్ఘండ్ లో బీజేపీ గెలిచేది కదా... గతంలో తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది? ఇలాంటి ఆరోపణలను జనం నమ్మరు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు బండి సంజయ్.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.