తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kaleshwaram Pumps : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభం

Kaleshwaram Pumps : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu

27 July 2024, 19:22 IST

google News
    • Kaleshwaram Pumps : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ప్రభుత్వం ఆన్ చేసింది. నంది పంపు హౌస్ లో మోటార్లను ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు స్టార్ట్
కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు స్టార్ట్

కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు స్టార్ట్

Kaleshwaram Pumps : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్ అయ్యాయి. నీటి ఎత్తిపోతలను ప్రభుత్వం ప్రారంభించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంపుహౌస్‌ లో నాలుగు మోటార్లు ఆన్‌ చేసి 13,076 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఆ నీటిని గాయిత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు.‌

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఆగస్టు రెండులోగా పంపులు ఆన్ చేయకుంటే 50 వేల మంది రైతులతో కన్నెపల్లికి చేరుకుని పంపులు ఆన్ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. వెంటనే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మోటర్లు ఆన్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తామని ప్రకటించారు. 24 గంటలు గడవకముందే నందిమేడారం (నంది) పంపుహౌస్‌ లో మోటర్లు ఆన్ చేశారు. ముందుగా రెండు మోటార్లు ఆన్‌ చేసి 6,538 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేసిన అధికారులు శనివారం సాయంత్రం మరో రెండు మోటార్లు ఆన్ చేసి మొత్తంగా నాలుగు మోటార్ల ద్వారా 13,076 క్యూసెక్కుల నీటిని లక్ష్మీ పూర్‌ (గాయత్రి) పంపుహౌస్‌ కు ట్విన్‌ టన్నెళ్ల ద్వారా తరలిస్తున్నారు. లక్ష్మీపూర్‌ (గాయత్రి) పంపుహౌస్‌ లో మధ్యాహ్నం 3 గంటలకు ఒక మోటారు ఆన్‌ చేసి 3,266 క్యూసెక్కల నీటిని లిఫ్ట్‌ చేస్తున్నారు. సాయంత్రం మరో మోటార్‌ ఆన్‌ చేసి రెండు మోటార్ల ద్వారా దాదాపు 7వేల క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు లిఫ్ట్ చేస్తున్నారు.

గాయిత్రి పంప్ హౌస్ నుంచి అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా ఎస్సారెస్పీ వరద కాలువకు, అటు నుంచి మిడ్‌ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. క్రమేణా ఈ రెండు పంపుహౌస్‌ ల నుంచి రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదట మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు డ్యాంలకు నీళ్లు ఇచ్చి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ లకు నీటి ఎత్తిపోతలు మొదలుపెడతారు.

శ్రీపాద ఎల్లంపల్లిలో 17 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వారం రోజుల క్రితం 6 టీఎంసీలు ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 17 టీఎంసీలకు నీరు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా వారం రోజుల్లో పది టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఎల్లంపల్లికి ప్రస్తుతం 13,659 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఎత్తిపోతల కోసం ఇక్కడి నుంచి 6,631 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు నిండడానికి సిద్ధంగా ఉండటంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు షురూ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చే వరద నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎగువకు లిఫ్ట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌డీఎస్‌ఏ అనుమతిస్తే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోస్తామని ఇరిగేషన్‌ వర్గాలు చెప్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు దించాల్సిన అవసరం లేకుండానే కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయాలంటే నిర్దేశిత నీటిమట్టం నదిలో ఉండాలని చెప్తున్నారు. యాసంగి సీజన్‌ వరకు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలున్నాయని, అప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి ఎగువన నీటి అవసరాలను బట్టి లిఫ్ట్‌ చేస్తామని అధికారులు చెప్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగంగా మారింది. కానీ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్టు అంతర్భాగం కాదని స్పష్టం చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుల్లో ఎల్లంపల్లి అంతర్భాగమని తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి సింగిల్‌ స్టేజ్‌ లిఫ్ట్‌ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించేలా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. మేడిగడ్డ నుంచి మూడు స్టేజీల్లో ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లికి నీటిని లిఫ్ట్‌ చేసేలా కాళేశ్వరం ను రీడిజైన్‌ చేశారు. ప్రాజెక్టుల పేర్లు, నీటి సోర్స్‌ మారినా కామన్‌ రిజర్వాయర్‌ ఎల్లంపల్లి అన్నది గుర్తించాల్సిన నిజం. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులో మొదట సిద్ధమైంది కూడా లింక్‌ -2 (అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు నీటిని తరలించే స్ట్రెచ్‌). మొదట ట్రయల్‌ రన్‌ చేసింది కూడా ఇప్పుడు నీటి ఎత్తిపోతలు మొదలు పెట్టిన నందిమేడారం పంపుహౌస్‌ లోనే.. తర్వాత ట్రయల్‌ రన్‌ చేసింది లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌ లో.. ఆ తర్వాత కొన్ని నెలలకు గాని కన్నెపల్లి పంపుహౌస్‌ లో ట్రయల్‌ రన్‌ చేయలేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి అంతర్భాగం అన్నది అప్పట్లోనే స్పష్టతనిచ్చారు. ఇప్పుడు అది వేరే ప్రాజెక్టు.. కాళేశ్వరంతో దానికి సంబంధం లేదు అనే వాదనలో పసలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్ అయి, ఎడారిని తలపిస్తున్న ఎల్ఎండి, మిడ్ మానేరు కు నీటిని లిఫ్ట్ చేయడంతో మెట్ట ప్రాంత రైతుల్లో ఆనందం నెలకొంది.

రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం