Kaleswaram Motors: కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లు ఆన్ చేయకుంటే 50వేల మందితో ముట్టడిస్తామని బీఆర్‌ఎస్ వార్నింగ్
26 July 2024, 5:38 IST
- Kaleswaram Motors: కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లు ఆన్ చేయకపోతే 50 వేల మంది రైతులతో కలిసి పంపులు ఆన్ చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. కేటిఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హెచ్చరించింది.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో కేటీఆర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
Kaleswaram Motors: తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు.. అలాంటి ప్రాజెక్టు అంతర్భాగంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా దిగువకు పోతుంది. ఎగువన లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ రిజర్వాయర్ లు ఎడారులను తలపిస్తున్నాయి.
అబద్దాలతో కాలం గడిపే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లను ఆన్ చేసి ఎల్ఎండి, మిడ్ మానేర్ లను నింపాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం డిమాండ్ చేసింది. లేకుంటే 50 వేల మంది రైతులతో పంప్ లను ఆన్ చేస్తామని హెచ్చరించారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన చేపట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటిఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, పాడి కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ , ఎల్.రమణ, మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముందుగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ ను సందర్శించారు.
ఎడారిని తలపిస్తున్న డ్యామ్ ను పరిశీలించి నీటి మట్టాన్ని.. డ్యామ్ లోకి వచ్చే వరద గురించి అడిగి తెలుసుకున్నారు. 24 టిఎంసి నీటి నిలువ సామర్థ్యం గల ఎల్ఎండి లో ప్రస్తుతం 5.3 టీఎంసీల వాటర్ ఉందని.. ఇన్ ఫ్లో 700 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా 27 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 5.5 టీఎంసీల నీరు ఉందని ఇన్ ఫ్లో 400 క్యూసెక్కులు మాత్రమే ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
కేసీఆర్ ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర…కేటిఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కెసిఆర్ బద్నాం చేసేందుకు కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. సరిగ్గా గతేడాది ఇదే రోజు ఎల్ఎండీలో 12 టీఎంసీలకు పైగా నీళ్లు ఉండేదని ప్రస్తుతం 5 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. పంపింగ్ సరైన సమయంలో చేసి ఎల్ఎండీ పూర్తిస్థాయిలో నింపి రైతులకు భరోసా ఇచ్చామని తెలిపారు.
ఈ ఏడాది 45 శాతం వర్షపాతం తక్కువ నమోదయ్యిందని ఇప్పటి వరకు పంపింగ్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మేడిగడ్డ వద్ద లక్షలాది క్యూసెక్కుల నీళ్లు కిందికి వృదాగా పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. అందుకే నీటి పంపింగ్ పై ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరామని తెలిపారు. ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వరద కాలువ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరుతున్నామని చెప్పారు.
రాజకీయ కక్షతో పంపింగ్ స్టార్ట్ చేయకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వృధాగా పోతున్న నీటిని పంపించేయకుండా ఈ ప్రభుత్వం వర్షం తక్కువ పడిందంటూ, వర్షాలు లేవంటూ సాకులు చెప్పి రైతులకు, ప్రజలకు నష్టం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉందన్నారు. కన్నెపల్లి దగ్గర పంప్ లు ఆన్ చేస్తే మొత్తం రిజర్వాయర్లు నిండుతాయని తెలిపారు.
మొత్తం రిజర్వాయర్లలో 140 టీఎంసీ లకు గాను 35 టీఎంసీలు కూడా నీరు లేదన్నారు. మేడిగడ్డ నుంచి పెద్ద ఎత్తున నీటిని పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు నింపితే ప్రజలకు మంచి నీటిని ఇబ్బందులు కూడా ఉండదన్నారు. ఆ విషయాన్ని పక్కన బెట్టి కేసీఆర్ ను బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ కొట్టుకుపోతుందని, లక్షల కోట్లు నీటి పాలు అయ్యాయంటూ 8 నెలలుగా కాంగ్రెస్ చేసిన ప్రచారం వట్టిదేనని తేలిపోయిందన్నారు.
ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెల పరిస్థితిని ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చామని తెలిపారు. నీటి పంపింగ్ ఎందుకు చేయటం లేదంటూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. పది లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవిగా నిలబడిందని, రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగామటం ఆడవద్దని సీఎం కు విజ్ఞప్తి చేస్తున్నానని కేటిఆర్ చెప్పారు. వాతావారణం అనుకూలిస్తే అన్ని బ్యారేజ్ లను సందర్శిస్తామని తెలిపారు. ఎండుతున్న రిజర్వాయర్లు, రైతుల వెతలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు మీడియా కూడా ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ధాన్యభండాగారం
కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగానే దేశానికే తెలంగాణ ధాన్య భండాగారంగా మారిందని కేటిఆర్ తెలిపారు. పంజాబ్, హర్యానాను తలదన్ని నీటి సమృద్ధిని సాధించటంతో వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు. ఏటా వృథాగా పోతున్న వందల టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు.
మేడిగడ్డ లో జరిగిన చిన్న సంఘటనను భూతద్ధంలో చూపి కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ చూపే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఎనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. అబద్దాలతో కాలం గడిపే కాంగ్రెస్ నేతలు కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లు ఆన్ చేయాలని కోరారు. ఎల్ఎండి, మిడ్ మానేర్ ను నింపి ఎగువ ప్రాంతాలకు సాగు త్రాగునీరు అందించాలన్నారు.
పంప్ లు ఆన్ చేయకుంటే రైతు ఉద్యమం తప్పదు
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లు ఆన్ చేయకుంటే రైతు ఉద్యమం తప్పదని ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వెంటనే పంప్ లను ఆన్ చేసి ఎల్ఎండి మిడ్ మానేర్ ను నింపాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ను బదనాం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వర్ ప్రాజెక్టు పై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదనుకుంటే మేడిగడ్డ నుంచి ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల నీరు ఎలా వెళ్తుందని ప్రశ్నించారు.
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 25 వేల క్యూసెక్కుల నీరు ఉంటేనే పంపులు ఆన్ చేసే అవకాశం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే పంప్ లు ఆన్ చేసి ఎడారిని తలపిస్తున్న ఎల్ఎండి, మిడ్ మానేర్, ఎస్సారెస్పీ వరద కాలువ నింపి ఎక్కువ ప్రాంతాలకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేసిఆర్ నేతృత్వంలో 50 వేల మంది రైతులతో కలిసి పంప్ లను ఆన్ చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అనంతరం వాస్తవాలను ప్రజలకు తెలిసేలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)