Jharkhand MLAs Camp : హైదరాబాద్ కు మారిన 'జార్ఖండ్' రాజకీయం - రిసార్ట్ లో ఎమ్మెల్యేల క్యాంప్..!
02 February 2024, 16:21 IST
- JMM-Congress MLAs Camp in Hyderabad: జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కు మారింది. బల నిరూపణకు గవర్నర్ సమయం ఇవ్వటంతో… జేఎంఎం - కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు.
హైదరాబాద్ కు చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు
JMM-Congress MLAs Camp in Hyderabad : జార్ఖండ్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత…. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం శాసనసభా పక్ష నేత చంపాయ్ సోరెన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించారు. అయితే రాజకీయ సంక్షోభానికి కారణం కాకుండా వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటుకు తమ అభ్యర్థనను ఆమోదించాలని కోరడంతో గవర్నర్ సమ్మతించారు. చంపాయ్ సోరెన్ తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవడానికి 10 రోజుల సమయం ఇచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ తెలిపారు.
హైదరాబాద్ లో ఎమ్మెల్యేల క్యాంప్….
జార్ఖండ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న జేఎంఎం - కాంగ్రెస్ కూటమి నేతలు… అప్రమత్తమవుతున్నారు. ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలను చేపట్టింది. 39 మంది ఎమ్మెల్యేలను రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కు తరలించింది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వీరంతా కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట నుంచి శామీర్ పేటలోని ఓ రిసార్ట్ కు ఎమ్మెల్యేలను తరలిస్తోంది. ఈ క్యాంప్ వ్యవహారాలన్నీ టీపీసీసీ ముఖ్య నేతలు సమన్వయం చేస్తున్నట్లు తెలిసింది.
అప్పటివరకు ఇక్కడే….
జార్ఖండ్‌లో బలపరీక్ష నిరూపణ వరకు ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్‌లోనే ఉండేలా చర్యలు చేపట్టింది జేఎంఎం - కాంగ్రెస్ కూటమి. జార్ఖండ్ లో ఉంటే ఎమ్మెల్యేలు చేజారే అవకాశం ఉంటుందని… అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణకు తరలిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయని భావించి… ఎమ్మెల్యేలను ఇక్కడికి తరలించారు. ఇందులో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలనిరూపం జరిగే సమయానికి ఎమ్మెల్యేలను జార్ఖండ్ కు తీసుకెళ్లనున్నారు.
చంపాయ్ సోరెన్ ఎవరు?
హేమంత్ సోరెన్ రాజీనామా, అరెస్ట్ నేపథ్యంలో…. 67 ఏళ్ల గిరిజన నేతగా పేరొందిన చంపాయ్ సోరెన్ జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు సింగ్భూమ్, పశ్చిమ సింగ్భూమ్, సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలతో కూడిన జార్ఖండ్లోని కొల్హాన్ ప్రాంతం నుంచి ఆయన ఆరో సీఎం. చంపాయ్ సోరెన్ సరైకెలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్గోడా గ్రామానికి చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
90వ దశకం చివర్లో శిబు సోరెన్ తో కలిసి జార్ఖండ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సోరెన్ అనతికాలంలోనే 'జార్ఖండ్ టైగర్ 'గా ఖ్యాతి గడించారు. సరైకెలా స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా స్వతంత్ర ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2010 సెప్టెంబర్ 11 నుంచి 2013 జనవరి 18 వరకు మంత్రిగా పనిచేశారు. రాష్ట్రపతి పాలన తరువాత, హేమంత్ సోరెన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, చంపాయ్ సోరెన్ ఆహార మరియు పౌర సరఫరాలు మరియు రవాణా మంత్రి అయ్యారు.