తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr | కేసీఆర్ ఫ్రంట్ ఏమైనట్టు.. ఆయనకు వచ్చిన సంకేతాలేంటి?

KCR | కేసీఆర్ ఫ్రంట్ ఏమైనట్టు.. ఆయనకు వచ్చిన సంకేతాలేంటి?

HT Telugu Desk HT Telugu

20 April 2022, 9:21 IST

google News
    • జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతా.. ఢిల్లీలో గత్తరా లేపుతా అంటూ.. గతంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? కేసీఆర్ ఫ్రంట్ సాధ్యమవుతుందా? దేశంలోని మిగతా పార్టీలు ఏమంటున్నాయి?
కేసీఆర్(ఫైల్ ఫొటో)
కేసీఆర్(ఫైల్ ఫొటో) (HT_PRINT)

కేసీఆర్(ఫైల్ ఫొటో)

ఎప్పటి నుంచో కేసీఆర్ మదిలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంది. అందులో భాగంగానే.. బీజేపీపై పోరు మెుదలుపెట్టారు. కలిసి వచ్చే.. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలని అనుకున్నారు. ప్రణాళికలో భాగంగానే.. మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రేతో, తమిళనాడు స్టాలిన్ తో భేటీలు వేశారు. అయితే మళ్లీ కొన్ని రోజులకు అది కాస్త.. వెనక్కు వెళ్లిపోయింది. కాంగ్రెసేతర.. ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు.. ఫలించలేదనే నిపుణుల అభిప్రాయం.

అయినా కేసీఆర్ ఎక్కడా వెనక్కు తగ్గలేదు.. బీజేపీపై ఏదో విధంగా పోరు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే.. ధాన్యం సేకరణపై ఢిల్లీలో కూడా నిరసన తెలిపారు. అయితే ఢిల్లీలో కేసీఆర్ దీక్షకు.. ఏ పార్టీ నుంచి.. మద్దతు దొరకలేదు. రాకేశ్ టికాయత్ మాత్రమే వచ్చి సంఘీభావం తెలిపారు.

మరోవైపు.. కేంద్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది అంటూ బీజేపీ వైఖరిని నిరసిస్తూ 13 రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో పాటు శరద్ పవార్, ఉద్దవ్ ఠాకరే, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్టీ, స్టాలిన్.. ఇలా జాతీయ స్థాయిలో పేరు వినిపించే ముఖ్యనేతలంతా.. లేఖను విడుదల చేశారు. కానీ.. అందులో కేసీఆర్ కు మాత్రం చోటుదక్కలేదు.

వాళ్లంతా కాంగ్రెస్ తో కలిసి నడుస్తారా.. లేరా అనేది వేరే విషయం. కానీ.. బీజేపీకి వ్యతిరేకులు. చాలా రోజుల నుంచి.. బీజేపీపై పోరు చేస్తున్న కేసీఆర్ కు మాత్రం.. ఇందులో చోటు లేకపోవడంతో.. రాజకీయ నిపుణుల నుంచి.. కేసీఆర్ ఫ్రంట్ సాధ్యం కాదనే అంటున్నారు.

గతంలో స్థాలిన్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ను సైతం.. కేసీఆర్ కలిశారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అయితే ఆ విషయం అప్పటికే పరిమితమైంది. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ కు బీజేపీతో రహస్య దోస్తీ ఉందనే ప్రచారం కూడా.. దీని కారణమై ఉంటుందా.. అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

మరోవైపు.. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్న రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ సైతం.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేసేందుకు.. అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. గాంధీలతో ఆయన కొన్ని రోజుల క్రితం సమావేశమయ్యారు. దాదాపు నెల రోజుల కిందటే కేసీఆర్ తోనూ ప్రశాంత్ భేటీ అయ్యారు. మళ్లీ.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ దగ్గరకు వెళ్లేసరికి.. ఫ్రంట్ ఏమవుతుందనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ నడవరు అనే విషయం అందరికీ తెలుసు.

ఇలాంటి సమయంలో.. కేసీఆర్ తో జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు ఎవరు కలిసి వస్తారానేది తెలియాల్సి ఉంది. పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్ సైతం.. కేంద్రంతో.. సఖ్యతగానే ఉంటున్నారు. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తో నడిచేది ఎవరో..? చూడాలి..

తదుపరి వ్యాసం