CM KCR | యాసంగి ధాన్యం ప్రభుత్వమే కొంటుంది.. రాష్ట్రంలో 6 ప్రైవేటు యూనివర్సిటీలు
12 April 2022, 20:07 IST
- కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్
కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. యాసంగి ధాన్యం మెుత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని కోరారు. ఊరికో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్వింటాల్ కు రూ.1960 చొప్పున ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. మరో మూడు, నాలుగు రోజుల్లో కొనుగోలు పూర్తి అవుతుందని చెప్పారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయని తెలిపారు.
'యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. దేశంలో పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉంది. దేశ రాజధానిలో 13 నెలల పాటు రైతులు ఉద్యమించారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టాలని ప్రధాని మోదీ చూశారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పి 3 సాగు చట్టాలను రద్దు చేశారు. ఇప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెంచి సాగు వ్యయం పెంచారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ మరో ఒత్తిడి చేశారు. విద్యుత్ సంస్కరణలు పేరిట రైతుల నుంచి ఛార్జీలు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.' అని కేసీఆర్ అన్నారు.
ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని చాలా సార్లు కలిశామని కేసీఆర్ అన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై.. కేంద్రమంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారన్నారు. ప్రజలు నూకలు తినే అలవాటు చేసుకోవాలని చెప్పినట్టు తెలిపారు. తెలంగాణలో గొప్ప పంటలు పండిస్తున్నారని.., అలాంటిది నూకలు తినాలా? అని ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ మరో ఒత్తిడి చేశారని అన్నారు. 'తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచలేదు. కేంద్రం ఎన్నోసార్లు ఎక్సైజ్ సుంకం పెంచింది. కేంద్రం పన్నులు పెంచుకుంటూ.. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని అంటున్నారు.' అని కేసీఆర్ అన్నారు.
కావేరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అమిటీ, సీఐఐ, గురునానక్, ఎంఎన్‌ఆర్ విశ్వవిద్యాలయాలకు ఆమోదం తెలిపామని కేసీఆర్ చెప్పారు. ఫార్మా యూనివర్సిటీని వెంటనే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని.. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రంలో 6 ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును ఆమోదించినట్లు పేర్కొన్నారు.
జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెప్పారు. కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించి జీవోను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహిస్తామని చెప్పారు.