తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : ఎన్నికల బరిలో 'వైఎస్ఆర్టీపీ'... షర్మిల నిర్ణయం ప్రభావం చూపుతుందా..?

TS Assembly Elections 2023 : ఎన్నికల బరిలో 'వైఎస్ఆర్టీపీ'... షర్మిల నిర్ణయం ప్రభావం చూపుతుందా..?

14 October 2023, 5:45 IST

google News
    • Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ బరిలో ఉంటుందన్నారు వైఎస్ షర్మిల. 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని… గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. అయితే షర్మిల తీసుకున్న నిర్ణయం ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల (Twitter)

వైఎస్ షర్మిల

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి తెలంగాణలోని రాజకీయ పార్టీలు. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేయగా… ధీటుగా కార్యాచరణను రూపొందించే పనిలో పడింది కాంగ్రెస్. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో… అభ్యర్థుల జాబితాతో పాటు అనుసరించాల్సిన వ్యూహలపై లోతుగా మేథోమథనం చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మిషన్ తెలంగాణకు పదును పెట్టే పనిలో ఉంది. పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇక బీఎస్పీ, తెలుగుదేశం, జనసేనతో పాటు పలు రాజకీయపక్షాలు కూడా తమవంతుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే… మొన్నటి వరకు కాంగ్రెస్ లో విలీనం వైపు అడుగులు వేసిన వైఎస్ షర్మిల…. మళ్లీ మొదటికి రావటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు… కాంగ్రెస్ తో 4 నెలల పాటు చర్చలు జరిపామని… కానీ అటువైపు నుంచి స్పందన లేదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు… తమ పార్టీ 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని… గట్టి పోటీనిస్తుందంటూ కీలక ప్రకటన చేశారు. దీంతో మరోసారి వైఎస్ షర్మిల నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

4 నెలలుగా కాంగ్రెస్ తో చర్చలు…

తెలంగాణ గడ్డపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి… సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ బిడ్డ ఇక్కడి ప్రజల కోసం పని చేస్తానని… చివరి వరకు ఇక్కడి ప్రజలతోనే ఉంటానని చెప్పుకొచ్చారు. అధికార బీఆర్ఎస్ పై గట్టిగా పోరాడే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ పెద్దలతో టచ్ లోకి వెళ్లిన షర్మిల… ఏకంగా పార్టీని విలీనం చేసే అంశంపై చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల వేళ…. షర్మిల నిర్ణయంపై అటు సొంత పార్టీ నేతలతో పాటు…. రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. దాదాపు విలీనం ఖరారే అన్న పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఉన్నట్టుండి… షర్మిల చేరికకు బ్రేకులు పడ్డాయి. సడన్ గా కాంగ్రెస్ సైలెన్స్ అయిపోవటంతో…. షర్మిల డైలామాలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి కీలక ప్రకటన చేశారు. విలీనం లేదని… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని తాజాగా ప్రకటన చేశారు. 119 నియోజకవర్గాల్లోనూ బరిలో ఉంటామని… అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రభావం ఏ మేరకు…?

ఇక షర్మిల తాజా నిర్ణయం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు వచ్చే ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉంటుందా.. ? రాజకీయంగా షర్మిల నిర్ణయం సరైనదేనా..? వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, రచయిత శ్రీరామ్ కర్రి స్పందిస్తూ…. పోటీ చేయాలని షర్మిల తీసుకున్న నిర్ణయం పెద్దగా అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే పూర్తిస్థాయిలో ఈ విషయాన్ని తోసిపుచ్చలేమని… ముఖ్యంగా తీవ్రమైన పోటీ ఉండే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం వందల ఓట్లలోనే ఉంటుందన్నారు. అలాంటి చోట్ల ఓట్లు చీలి… విజయం తారుమారు అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది జరగాలంటే… అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్టీపీ తరపున సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంటుందన్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోవటంతో… బలమైన అభ్యర్థులు బరిలో ఉండటం కష్టమనే చెప్పొచ్చు అని అన్నారు.

అంతేకాకుండా… వైఎస్ఆర్టీపీకి గుర్తు కూడా ముఖ్యమే అన్నారు శ్రీరామ్ కర్రి. YSRTP కేవలం రిజిస్టర్ అయిన పార్టీ మాత్రమే కానీ… ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందిన పార్టీ కాదన్నారు. కాబట్టి ఎన్నికల్లో పోరాడేందుకు ఆ పార్టీకి ఉమ్మడి గుర్తు వస్తుందా అనేది అనుమానమే అని అభిప్రాయపడ్డారు. మరో రాజకీయ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో చర్చల పేరుతో ఎన్నికల వేళ నాలుగు నెలల విలువైన సమయాన్ని వైఎస్ షర్మిల వృథా చేసుకుందన్నారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసినప్పటికీ… వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేదనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి ఆదరణ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

మొత్తంగా చూస్తే ఇప్పటికే బరిలో ఉంటామని ప్రకటన చేసిన నేపథ్యంలో… వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఏ మేరకు ప్రభావం చూపుతారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఇక ఆమె పాలేరులో నుంచి ఉంటానని చెప్పగా… తల్లి విజయమ్మ పోటీపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు బ్రదర్ అనిల్ కూడా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

తదుపరి వ్యాసం