తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress : షర్మిలకు దూరంగా... వారికి దగ్గరగా..! వ్యూహత్మకంగా కాంగ్రెస్ అడుగులు

Telangana Congress : షర్మిలకు దూరంగా... వారికి దగ్గరగా..! వ్యూహత్మకంగా కాంగ్రెస్ అడుగులు

12 October 2023, 16:40 IST

    • TS Assembly Elections 2023 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే టార్గెట్ గా అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. గతంలో జరిగిన తప్పులకు మరోసారి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో… వైఎస్ షర్మిల విషయంలోనూ వ్యూహత్మకమైన అడుగులు వేసింది తెలంగాణ కాంగ్రెస్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా వ్యూహత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోంది. అధికార బీఆర్ఎస్ ఎత్తుగడలకు ధీటుగా కార్యాచరణను రూపొందించే పనిలో పడింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో… అభ్యర్థుల జాబితాతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై లోతుగా మేథోమథనం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచిన హస్తం జెండాను ఎగరవేయాలని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు… పక్కాగా అడుగులు వేసే పనిలో ఉన్నారు. ఏ చిన్న ఛాన్స్ ను కూడా వదులుకునే పరిస్థితి లేకుండా… పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే… కలిసివచ్చే పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. అయితే గత అనుభవాల దృష్ట్యా…. ఈసారి లెక్క తప్పకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

ఆమెకు దూరంగా.. వీరికి దగ్గరగా…!

తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు వైఎస్ షర్మిల. నిజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిన షర్మిల… ఆ తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఏకంగా ఢిల్లీ పెద్దలతో నేరుగా చర్చలు జరపటమే కాదు… తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీని విలీనం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంలో హైకమాండ్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ…. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఆచితూచీ స్పందిస్తూ వచ్చింది. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ…. ఆంధ్రాలోనే రాజకీయం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మాత్రం గట్టిగా వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేయాలని భావిస్తున్న షర్మిల ఆలోచనలకు భిన్నంగా స్పందించారు. అయితే ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ కు దగ్గరయ్యారో… అధికార బీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. కేవీపీ, షర్మిల రూపంలో తెలంగాణపై మళ్లీ కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం… షర్మిల విషయంలో వ్యూహత్మక వైఖరితో ముందుకెళ్లాలని నిర్ణయించింది. చర్చలను పక్కన పెట్టేయడమే కాదు… విలీన ప్రక్రియకు బ్రేకులు వేసేసింది.

అనుకున్నట్లు జరగకపోవటంతో… తెలంగాణలో పోటీకి సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. ఇప్పటికే పోటీ చేసే స్థానాలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ మరో దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ - కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవటంతో…. కామ్రేడ్లతో కలిసి నడిచేందుకు హస్తం నేతలు సిద్ధమయ్యారు. ఇరు పార్టీల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. రేపోమాపో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పైగా కామ్రేడ్లు ఇండియా కూటమిలో ఉండటం కూడా కాంగ్రెస్ కు కలిసివచ్చే అంశంగా భావిస్తోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లోని ఓట్లు కూడా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది.

తెరపైకి కోదండరామ్..!

ఇక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ ను మరోసారి కలుపుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో ఆయన స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీతో పొత్తు పెట్టుకోవటమే కాకుండా… నాలుగు సీట్లను ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఆ సమయంలోనే కోదండరామ్… జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయకపోవటంతో… ఆయన పోటీకి దిగలేదు. కానీ ఆ ఎన్నికల్లో పొత్తు ప్రభావం చూపకలేదు. పైగా బీఆర్ఎస్ భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి కోదండరామ్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవాలని భావిస్తుందట కాంగ్రెస్.! అయితే గతంలో మాదిరిగా నాలుగు సీట్లు కాకుండా… ఒకటి నుంచి రెండు సీట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే… జనగామ నుంచి కోదండరామ్ బరిలో ఉండే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. అయితే దీనిపై ఇరుపార్టీల నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. సరిగ్గా దీన్నే ఆయుధంగా మలుచుకుంది బీఆర్ఎస్. చంద్రబాబును ప్రధానంగా ప్రస్తావిస్తూ… కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో తన ప్రసంగాలతో ప్రజలను ఆలోచనలో పడేయటంతో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఏకంగా 88 సీట్లను గెలుచుకొని తిరుగులేని శక్తిగా మారింది బీఆర్ఎస్. అయితే గత అనుభవాల దృష్ట్యా…. ఈ ఎన్నికలను అత్యంత సీరియస్ గా తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్. షర్మిలతో కలిసి పని చేస్తే వచ్చే ఇబ్బందులను కూడా ముందుగానే అంచనా వేసింది. ఇదే విషయాన్ని అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ విలీనం ఆగిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం