తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra Demolitions : 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 111 ఎకరాల భూమి స్వాధీనం - వివరాలను వెల్లడించిన 'హైడ్రా'

HYDRA Demolitions : 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 111 ఎకరాల భూమి స్వాధీనం - వివరాలను వెల్లడించిన 'హైడ్రా'

11 September 2024, 16:48 IST

google News
    • Hydra Demolitions Report : అక్రమ నిర్మాణల కూల్చివేతలపై ‘హైడ్రా’ వివరాలు వెల్లడించింది. 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్‌ 27 నుంచి 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది.
హైడ్రా కూల్చివేతలు
హైడ్రా కూల్చివేతలు

హైడ్రా కూల్చివేతలు

అక్రమ నిర్మాణలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే చాలా చోట్ల అక్రమ నిర్మాలను కూల్చేవేసింది. మరికొన్నింటికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన పనులపై ప్రభుత్వానికి హైడ్రా ఓ నివేదికను సమర్పించింది. ఇందులో హైడ్రా చేపట్టిన వివరాలను పేర్కొంది.

మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. జూన్ 27 నుంచి పలు నిర్మాణాలను తొలగించినట్లు వివరించింది. గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్‌లో 54 నిర్మాణాలు కూల్చగా… రాజేంద్రనగర్‌ 45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను తొలగించినట్లు ప్రస్తావించింది.

హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది:

హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యుటేషన్‌పై ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. హైడ్రాకు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఉన్నారు.

ఇక నగరంలో కూల్చివేతలతో పాటు ఇళ్లు, ఫ్లాట్లు కొనేవారికి ఇటీవలే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక సూచన లుచేశారు. ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని… కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామని పేర్కొన్నారు.

హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు అయ్యింది. ఈ నెల 8న మాదాపూర్‌ సున్నంచెరువులో హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది. ఈ సమయంలో.. హైడ్రా కూల్చివేతను స్థానికులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని.. వెంకటేష్‌, లక్ష్మి, సురేష్‌పై కేసు నమోదు చేశారు.

హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి... ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు విస్తరించి ఉంటుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైడ్రా... మొదటగా అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝలిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న చెరువుల రికార్డులన్నింటిని పరిశీలిస్తోంది. గత రికార్డుల ప్రకారం ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉండేది...? ప్రస్తుతం ఎంత ఉందనే దానిపై ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించే పని పెట్టుకుంది. ఫిర్యాదులు స్వీకరించేందుకు త్వరలోనే ప్రత్యేక వ్యవస్థలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే కొన్ని ప్రాంతాలను ఏవీ రంగనాథ్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆ మరునాడే ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు జరిగాయి.

తదుపరి వ్యాసం