TS MPDOs Transfers : తెలంగాణలో 395 మంది ఎంపీడీవోలు బదిలీ
11 February 2024, 15:41 IST
- TS MPDOs Transfers : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ గైడ్ లెన్స్ తో తెలంగాణలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని 395 ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
తెలంగాణలో 395 మంది ఎంపీడీవోలు బదిలీ
TS MPDOs Transfers : తెలంగాణలో భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 395 ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఈసీ డిసెంబరులో అన్ని రాష్ట్రాలను ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. శనివారం రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఇతర శాఖల్లోనూ భారీగా బదిలీలు జరగనున్నట్లు సమాచారం.
ఎమ్మార్వో, డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
తెలంగాణలో భారీగా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీలు చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో శనివారం తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పలువురు అధికారులకు బదిలీలతో పాటు ప్రమోషన్లు ఇచ్చింది. ఇప్పటి వరకూ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు ఇచ్చింది. దీంతో పాటు 132 మంది ఎమ్మార్వోలు ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. మల్టీజోన్-1లో 84 మంది, మల్టీజోన్-2లో 48 మొత్తం 132 మంది ఎమ్మార్వోలను బదిలీ చేసింది. ఒకే చోట మూడేళ్లుగా పని చేస్తున్న అధికారులు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి.
ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఓ ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్‌ను బదిలీ చేశారు. ఆమె ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్‌ను నియమించారు. నవీన్ నికోలస్ గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉంది. ఐఏఎస్‌గా పదోన్నతులు పొంది వెయిటింగ్‌లో ఉన్న సీతాలక్ష్మి, ఫణీంద్రరెడ్డిలకు పోస్టింగులు ఇచ్చారు. ఐఎఫ్‌ఎస్ అధికారి వీఎస్‌ఎన్వీ ప్రసాద్ పౌరసరఫరాల డైరెక్టర్‌గా నియమించారు.
టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాం భూక్యాను బాధ్యతల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు తిప్పి పంపించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగా బదిలీ చేశారు.