500 Gas Cylinder Subsidy : 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్, లబ్దిదారుల ఖాతాల్లోకే డబ్బులు
24 February 2024, 12:43 IST
- 500 Gas Cylinder Subsidy : 500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు గ్యాస్ ఏజెన్సీలో చర్చలు జరుపుతున్నారు.
500 గ్యాస్ సిలిండర్ స్కీమ్,
500 Gas Cylinder Subsidy : 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ స్కీమ్ గ్యారెంటీలను(500 Gas Cylinder Subsidy) ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. అయితే ఈ పథకంలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. నగదు బదిలీ విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలో....లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో లబ్దిదారులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రకటించింది. దీంతో మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
40 లక్షల మహిళా లబ్దిదారులు
500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కొత్త గ్యాస్ కనెక్షన్లకు పథకం వర్తించదని అధికారులు తెలిపారు. పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న వారికే గ్యాస్ సబ్సిడీ(Gas Subsidy) అమలు చేస్తామన్నారు. లబ్దిదారులు గత మూడేళ్లలో వాడిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల మహిళా లబ్ధిదారులను గుర్తించారు. వీరితో ఈ పథకాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నారు. గ్యాస్ సబ్సిడీ చెల్లింపులకు ఎన్‌పీసీఐ ప్లాట్‌ఫాంగా పనిచేస్తుండగా, ఎస్‌బీఐ నోడల్ బ్యాంకుగా ఉంది.
ఆర్థికపరమైన అంశాలు
అయితే ఈ పథకం అమల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషన్ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమస్యలు అధికారులకు తెలిపారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ అందుకు ఆయిల్ కంపెనీల అనుమతి పొందాల్సి ఉందన్నారు. దీనిలో ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయన్నారు. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ అవకతవకలకు పాల్పడే అవకాశాలు కూడా ఉండడంతో... నేరుగా ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
లబ్దిదారుల ఎంపిక ఇలా
మహాలక్ష్మిపథకంలో రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్దిదారులను ఎంపికకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రజా పాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఆశావర్కర్ల సాయంతో లబ్దిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఆశా కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డుతోపాటు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ పథానికి అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అయితే తెల్లరేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. వీటిలో 64 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతానికి రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కానున్నారు. మిగిలిన 26 లక్షల తెల్లరేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేకపోవడం..వారికి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 26 లక్షల మంది కొత్త గ్యాస్ కలెక్షన్ తీసుకుంటే ఈ పథకం వర్తించస్తుంది.