TS CETs Notifications : తెలంగాణ ఈఏపీసెట్ సహా ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏ సెట్ ఎప్పుడంటే?
07 February 2024, 14:19 IST
- TS CETs Notifications : తెలంగాణలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 9 నుంచి 12 వరకు టీఎస్ ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు.
టీఎస్ ఈఏపీ సెట్ 2024
TS CETs Notifications : తెలంగాణ ఈఏపీసెట్(EAPCET 2024) సహా పలు ఉమ్మడి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 9 నుంచి 12వ తేదీ వరకు టీఎస్ ఈఏపీసెట్ నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ దీన్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 21న టీఎస్ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి 2024-25 విద్యాసంవత్సరానికి ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు.
ఈఏపీసెట్ షెడ్యూల్
టీఎస్ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న విడుదలకానుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ కోర్సులకు, మే 12న అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్
- టీఎస్ ఈసెట్ -మే 6
- టీఎస్ ఎడ్‌సెట్ - మే 23 న
- టీఎస్ లా సెట్ - జూన్ 3
- టీఎస్‌పీజీ సెట్-జూన్ 6 నుంచి 9 వరకు
- టీఎస్ ఐసెట్- జూన్ 4, 5
- టీఎస్ పీఈసెట్- జూన్ 10 నుంచి 13 వరకు
- టీఎస్ పీజీఈసెట్-జూన్ 6 నుంచి 8 వరకు
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ ఐసెట్(TS ICET-2024) ఎంట్రెన్స్ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. టీఎస్ ఐసెట్ ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. లా కాలేజీల్లో 3, 5 ఏళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ లా సెట్(TS Law CET-2024) నిర్వహించనున్నారు. ఈ పరీక్షను జూన్ 3న నిర్వహించనున్నారు. పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎల్ఎల్ఎం(LLM) ప్రవేశ పరీక్షను జూన్ 3న నిర్వహించనున్నారు. ఈ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. బీపీఎడ్(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ పీఈసెట్(TS PECET) పరీక్షను జూన్ 10 నుంచి 13 మధ్య నిర్వహించనున్నారు. ఈ పరీక్షను శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్టీయూ హైదరాబాద్ టీఎస్ పీజీఈసెట్(TS PGECET-2024) పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించనుంది.
ఎంసెట్ పేరు మార్పు
తెలంగాణలో ఎట్టకేలకు ఎంసెట్ పేరు మార్పు జరిగింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో మెడికల్ అడ్మిషన్లను తీసేసి ఆరేడేళ్లు దాటినా పాతపేరునే కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పేరును అయా కోర్సులకు అనుగుణంగా పేరు మార్చనున్నారు. ఈ ఏడాది కొత్త పేరుతోనే ప్రవేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశపరీక్ష పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్ ద్వారా కేంద్రం భర్తీ చేస్తోంది. మెడికల్ కోర్సులు లేకపోయినా ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీలో ఆ పదాన్ని తొలగించి ఈఏపీ సెట్‌గా నిర్వహిస్తున్నారు. తాజాగా తెలంగాణ కూడా ఎంసెట్ ను ఈఏపీ సెట్ గా మార్చింది.