CPS Employees : పాత పెన్షన్ విధానం అమలు అయ్యేలా చూడండి, పీఆర్సీ కమిషన్ కు సీపీఎస్ యూనియన్ వినతి
04 March 2024, 21:53 IST
- CPS Employees : సీపీఎస్ ఉద్యోగుల యూనియన్ సభ్యులు ఇవాళ 2వ పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ ను కలిశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు అయ్యేలా సిఫార్సులు చేయాలని కోరారు.
పీఆర్సీ కమిషన్ కు సీపీఎస్ యూనియన్ వినతి
CPS Employees : హైదరాబాద్ లోని బి.ఆర్.కె భవన్ లో 2వ పీఆర్సీ కమిషన్ (PRC Commission)ఛైర్మన్ శివ శంకర్ ను తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ లు కలిశారు. 2వ పీఆర్సీలో అయిన 01.09.2004 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్(Pension Rules), పాత పెన్షన్ పద్ధతి అమలు అయ్యేలా ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. కమిషన్ కు సీపీఎస్ విధానంలో రిటైర్మెంట్ అయిన, చనిపోయిన కుటుంబాల కేస్ స్టడీ లతో 20 పేజీల నివేదిక అందజేశారు. సీపీఎస్ విధానంలో ప్రతి సంవత్సరం ఉద్యోగి, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కలిపి రూ.3000 కోట్లు ఎన్. పి.ఎస్ ట్రస్ట్(NPS Trust) కు వెళ్తున్నాయన్నారు. పాత పెన్షన్ విధానం అమలు వల్ల ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత చేకురుతుందని, వేతన సవరణ జరిగిన ప్రతిసారి షేర్ మార్కెట్ కు తరలివెళ్లే సొమ్ము పెరుగుతుందని తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ రామకృష్ణ రావును కలిసిన యూనియన్ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ జి.ఓ 58 జారీ చేసిన తేదీ నుంచి కాకుండా ఉద్యోగి సర్వీస్ లో చనిపోయిన తేదీ నుంచి అమలు చేసేలా ఉత్తర్వులపై సరైన వివరణ ఇవ్వాలని విన్నవించారు.