CM Revanth Reddy : ప్రతీ మూడు నెలలకు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
29 January 2024, 18:18 IST
- CM Revanth Reddy : మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ లోని సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖ మంత్రి దామోదర్ నరసింహ, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం కామన్ పాలసీ విధానాన్ని తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొడంగల్ లో మెడికల్, నర్సింగ్ కాలేజీలో ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని కోరారు. ఎయిమ్స్ పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం తెలిపారు.
వైద్య సేవల కోసం అవసరమైతే నేనే కేంద్ర మంత్రిని కలుస్తా- సీఎం
ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం కూడా తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులకు సూచించారు. వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉస్మానియ ఆసుపత్రి విస్తరణలో వచ్చే సమస్యలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై రేపు హైకోర్టులో బెంచ్ పైకి ఉస్మానియా హెరిటేజ్ భవనం ఇష్యూ రానుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు. ఏరియాల వారీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్నింటిని గుర్తించి వాటికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
3 నెలలకోసారి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేయాలి
మెడికల్ కాలేజీ లతో అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో హౌస్ కీపింగ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్వాహణ ఖర్చు వారే భరించేలా చూడాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో ఏదో ఒక ఆసుపత్రిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అధికారులను కోరారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించిన వివరణను రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్, పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతి నెల 15వ తేదీల్లోగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని సూచించారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి విధిగా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, ఫీజియోథెరపీ, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా