తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : వచ్చే నెలలోనే వివాహం, డెంటల్ చికిత్సకు వెళ్లిన యువకుడు మృతి!

Hyderabad News : వచ్చే నెలలోనే వివాహం, డెంటల్ చికిత్సకు వెళ్లిన యువకుడు మృతి!

20 February 2024, 16:29 IST

google News
    • Hyderabad News : వారం రోజుల క్రితమే నిశ్చితార్థం, వచ్చే నెలలో వివాహం...ఇంతలోనే యువకుడు మృతి చెందాడు. దంత వైద్యం కోసం క్లినిక్ వెళ్లగా...ఆపరేషన్ ప్రక్రియలో యువకుడు మృతి చెందాడు.
డెంటల్ చికిత్సకు వెళ్లిన యువకుడు మృతి
డెంటల్ చికిత్సకు వెళ్లిన యువకుడు మృతి

డెంటల్ చికిత్సకు వెళ్లిన యువకుడు మృతి

Hyderabad News : హైదరాబాద్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మరో నెలలో వివాహం నిశ్చయించుకున్న యువకుడు ప్రాణాలు విడిచాడు. పెళ్లికి ముందు స్మైల్ డిజైనింగ్(Smile Designing) చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న వింజం లక్ష్మీనారాయణ(28) అనే యువకుడు డెంటల్ చికిత్స కోసం జూబ్లీహిల్స్‌(Jubilee Hills) రోడ్‌ నెం. 37లో ఉన్న ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌(Dental clinic) కు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడు దూరమయ్యాడని రోధిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగింది?

హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత వైద్యం చేయించుకుంటూ 28 ఏళ్ల యువకుడు మరణించాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుమారుడి మరణానికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్జరీ సమయంలో తమ కుమారుడు స్పృహతప్పి పడిపోయాడని డెంటల్ క్లినిక్ సిబ్బంది తనకు ఫోన్ చేసి అపోలో ఆసుపత్రికి రమ్మని చెప్పారని లక్ష్మీ నారాయణ తండ్రి వింజం రాములు తెలిపారు. అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే యువకుడు మరణించాడని తెలిపారని రాములు చెప్పారు. డెంటల్ చికిత్స గురించి తన కుమారుడు తమకు తెలియజేయలేదన్నారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తమ కుమారుడి మరణానికి వైద్యులదే బాధ్యత అని రాములు ఆరోపించారు.

మత్తు మందు అధిక మోతాదులో!

ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి వివరాలు తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బాధితుడు లక్ష్మీనారాయణ డెంటల్ క్లినిక్‌కి వచ్చాడు. సాయంత్రం 4.30 గంటలకు అతడిని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్లారు. రెండు గంటల పాటు శస్త్ర చికిత్స ప్రక్రియ కొనసాగింది. రాత్రి 7 గంటలకు క్లినిక్ సిబ్బంది లక్ష్మీనారాయణ తండ్రికి ఫోన్ చేశారు. అతడిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు లక్ష్మీనారాయణ చనిపోయినట్లు తెలిపారు. లక్ష్మీనారాయణ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారు. తన వివాహానికి ముందు జూబ్లీహిల్స్‌లోని డెంటల్ క్లినిక్ లో స్మైల్ డిజైనింగ్ ప్రక్రియ చేయించుకుంటున్నారు. ఈ చికిత్సలో భాగంగా లక్ష్మీనారాయణకు ఆసుపత్రి సిబ్బంది అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత అతడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. బాధితుడిని క్లినిక్ సిబ్బంది అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

పోస్టుమార్టమ్ రిపోర్టు కీలకం

దంత వైద్యుని నిర్లక్ష్యంతో పాటు మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడం వల్లే తమ కుమారుడు మృతి చెందిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సెక్షన్ 304 (ఎ) కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, ఆ రిపోర్టులు వస్తే మరణానికి గల కారణాలను గుర్తించేందుకు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. ఆసుపత్రి రికార్డులు, సెక్యూరిటీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నామన్నారు. వారం రోజుల క్రితమే లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరగగా, వచ్చే నెలలో వివాహం నిశ్చయించుకున్నారు. ఇంతలోనే దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

తదుపరి వ్యాసం