Hyderabad Crime : లాంగ్ డ్రైవ్ కార్ల కంపెనీ యాజమాని దాష్టీకం, సిబ్బందిని నిర్బంధించి దాడి!
14 February 2024, 19:26 IST
- Hyderabad Crime : తన వద్ద పని మానేశారని సిబ్బందిని నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేశాడు లాంగ్ డ్రైవ్ కార్ల కంపెనీ యజమాని, బీఆర్ఎస్ నేత కొప్పుల హరిదీప్ రెడ్డి. ఈ దాడిపై ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదని బాధితులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
లాంగ్ డ్రైవ్ కార్ల కంపెనీ యాజమాని దాష్టీకం
Hyderabad Crime : లాంగ్ డ్రైవ్ కార్ల కంపెనీ యాజమాన్యం తమ ఉద్యోగులపై అమానుషంగా ప్రవర్తించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొప్పుల హరిదీప్ రెడ్డి అనే వ్యక్తి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లాంగ్ డ్రైవ్ కార్ల ( రెంటల్ ) పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీలో సాయి తరుణ్, ఒబెదు, నితిన్, యోగి, రిషిత, మధుమితలు గత కొన్ని నెలలుగా పని చేస్తున్నారు. కాగా వీరికి నెలకు రూ. 15 వేల జీతం ఇచ్చేవారు. అయితే విధులకు గంట ఆలస్యమైనా....జీతంలో రూ.500 కోత విధిస్తూ ఉండడంతో వారిలో ఒక యువతి పని మానేసింది. ఇటీవల కంపెనీ వద్దకు వచ్చిన ఆమె తన స్నేహితులతో మాట్లాడింది. మాట్లాడిన మరుసటి రోజు నుంచి వారు కూడా ఆ కంపెనీలో పని మానేశారు.
ఉద్యోగులపై కంపెనీ యజమాని అమానుష దాడి
దీంతో యజమాని కొప్పుల హరుదీప్ రెడ్డి సిబ్బందిని మంగళవారం ఆఫీసుకు పిలిపించాడు. అనంతరం ఎందుకు ఉద్యోగం మానేశారు అంటూ వారితో వాగ్వాదానికి దిగిన హరిదీప్ రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గంటల తరబడి కంపెనీ ఆఫీసులో వారిని చిత్రహింసలకు గురి చేసి ఇద్దరి మహిళలను మంగళవారం మధ్యాహ్నం వదిలి వేయగా.. మిగతా వారిని మంగళవారం రాత్రికి వదిలేశారు. దీంతో బాధితులు తమ బంధువులు, స్నేహితులకు సమాచారం అందించి వారి సాయంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఒక గిరిజన మహిళ కూడా ఉండగా.....ఆమెను కులం పేరుతో కొప్పుల హరిదీప్ రెడ్డి దూషించడాని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వారికి కుల సంఘాలు మద్దతు తెలిపాయి. మంగళవారం నిందుతుడు హరిదేప్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, కుల సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి డిమాండ్ చేశారు. మరోవైపు గిరిజన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు. కాగా కొప్పుల హరిదీప్ రెడ్డి భువనగిరి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు. అతడు ప్రస్తుతం ఆత్మకూరు మండల బీఆర్ఎస్(BRS) పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు.
భార్యను చితకబాదిన భర్త అరెస్ట్
భార్యను మద్యం మత్తులో చితకబాదిన వ్యక్తిని మంగళహాట్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. శివనగర్ ప్రాంతంలో నివాసం ఉండే విజయ్ సింగ్, భార్య పూజా సింగ్ ను తాగిన మైకంలో విచక్షణారహితంగా చితకబాదాడు. దాంతో ఆమె గర్భంలో ఉన్న శిశువు మృతి చెందాడు. దీంతో స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి పూజా సింగ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పూజా సింగ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విజయ్ సింగ్ ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ రవి కుమార్ వెల్లడించారు. గర్భంతో ఉన్న భార్యపై కనికరం కూడా లేకుండా దాడి చెయ్యడంతో ఆమె గర్భంలో ఉన్న శిశువు మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా