తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి

05 October 2024, 22:27 IST

google News
    • CM Revanth Reddy : మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. కేసీఆర్ ఫాం హౌస్ లో 500 ఎకరాలు భూదానం చేస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా - సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు. దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) 95వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వెంకటస్వామిని స్ఫూర్తిగా తీసుకుని నిరుపేదలందరికీ ఒక మంచి జీవితాన్ని, మంచి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీనిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగరంలో 12 నుంచి 14 వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకుని బతుకుతున్నారు. నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కు సూచించారు.

కేసీఆర్ ఫాంహౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు

మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ కు వెయ్యి ఎకరాల్లో ఫాం హౌస్ ఉందని, అందులో 500 ఎకరాలు ఇస్తే ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. కేసీఆర్ భూదానం చేస్తే ఇండ్లు కట్టించే బాధ్యత తనదన్నారు. జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ కు 50 ఎకరాలు ఉందని, అందులో 25 ఎకరాలు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రూ. 1500 కోట్లు ఉన్నాయని, ఒక రూ.500 కోట్లు ఇస్తే ప్రజలకు పంచుదామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదంతా ప్రజల నుంచి దోచుకున్న సొమ్మే కదా అని మండిపడ్డారు.

ఆనాడు వెంకటస్వామి వేలాది మంది పేదలకు గూడు కల్పించారన్నారు. సింగరేణి మూతపడే దశకు చేరుకున్న దశలో దాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేశారని సీఎం గుర్తుచేశారు. ఆ మహనీయుడు వెంకటస్వామి ఆకాంక్షించినట్టు తమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఆదిలాబాద్ కు నీరందిస్తామని, అభివృద్ధిలో ఆదిలాబాద్ తో పాటు పెద్దపల్లి జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకాను సమున్నతంగా గౌరవిస్తూ వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం