తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : డీఎస్సీ ఇచ్చిన 65 రోజుల్లోనే 10 వేల మందికి నియామకపత్రాలు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : డీఎస్సీ ఇచ్చిన 65 రోజుల్లోనే 10 వేల మందికి నియామకపత్రాలు- సీఎం రేవంత్ రెడ్డి

09 October 2024, 18:58 IST

google News
    • CM Revanth Reddy : డీఎస్సీ-2024 లో ఎంపిక అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండుగ ముందే వచ్చినట్లుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉపాధ్యాయ నియామకపత్రాలు అందించామన్నారు.
డీఎస్సీ ఇచ్చిన 65 రోజుల్లోనే 10 వేల మందికి నియామకపత్రాలు- సీఎం రేవంత్ రెడ్డి
డీఎస్సీ ఇచ్చిన 65 రోజుల్లోనే 10 వేల మందికి నియామకపత్రాలు- సీఎం రేవంత్ రెడ్డి

డీఎస్సీ ఇచ్చిన 65 రోజుల్లోనే 10 వేల మందికి నియామకపత్రాలు- సీఎం రేవంత్ రెడ్డి

తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని ఆనాడు మాట ఇచ్చామని, నేడు అది రుజువు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ-2024 ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండగ మూడు రోజుల ముందే వచ్చినట్లుందని టీచర్ ఉద్యోగాలు పొందిన వారితో అన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నామన్నారు. ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు.

"తెలంగాణ వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మూడేళ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్ల తరువాత 2019 నియామకాలు జరిపారు. తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టాం. మేం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉపాధ్యాయ నియామకపత్రాలు అందిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర కీలకం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం" - సీఎం రేవంత్ రెడ్డి

కొందరు కండ్లల్లో కారం కొట్టుకుంటున్నారు

రాష్ట్రంలో 34 వేల మంది టీచర్ల బదిలీలతో పాటు 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు అందించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొన్ని కొరివి దెయ్యాలు మీకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేశాయని, మీ కుటుంబాల్లో సంతోషాన్ని చూసేందుకు అన్నింటినీ ఎదుర్కొని నియామకపత్రాలను అందజేస్తున్నామన్నారు. మీ సంతోషం చూసి కొంతమంది కండ్లల్లో కారం కొట్టుకుంటున్నారన్నారు. గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ .. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వాళ్లు సలహాలు ఇవ్వరు... కానీ మేం చేస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారన్నారు.

ఇవాళ్టి కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పదేళ్లు పాలన చేసిన వారు పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారన్నారు. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరన్నారు. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు..నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్లే అన్నారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు స్కిల్ యూనివర్సిటీ

"తెలంగాణలోని 10 వేల పాఠశాలల్లో 34 లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 11న పనులు ప్రారంభించుకోబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 1 లక్షా 10 వేల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు"- సీఎం రేవంత్ రెడ్డి

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు.

తదుపరి వ్యాసం