Telugu States : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిసందడి, 3 రోజుల్లో ముగియనున్న శుభ ముహుర్తాలు
06 September 2023, 10:42 IST
- Marriage Season in Telugu States: శ్రావణమాసం కావటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిసందడి నెలకొంది. అయితే మరో మూడు రోజుల్లో శుభముహుర్తాలు ముగియనున్నారు. ఈ మూడు రోజులు లక్షల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిసందడి
Pelli Sandhadi: ముచ్చటగా మూడు రోజుల పాటే ముహుర్తాలు మిగలగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వివాహాలు కానున్నాయి.. ఆషాఢ మాసం ,అధికశ్రావణ మాసాల అనంతరం ప్రారంభమైన శ్రావణమాసంలో చాలా తక్కువ ముహుర్తాలు ఉండడంతో ఆరంభంలో లగ్నాలు కుదుర్చుకున్న వధూవరులు శ్రావణమాసంలోని చివరి ముహుర్తాలకే మొగ్గుచూపారు.పెండ్లికి కనీసం ఇరవై రోజులైన గడువు ఉండాలనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ 7,8,10 వ తేదీలను ఎక్కువగా ఎంచుకున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో వివాహాల సందడి ప్రారంభం కానుంది.
శ్రావణ మాసంలో ముహుర్తాలు తక్కువగా ఉండడంతో పాటు గడిచిన రెండు నెలల నుండి ముహుర్తాలు పూర్తిగా లేవు. అయితే తాజాగా ఖరారు చేసుకున్న ఈ ముహుర్తాల్లోనే ఎక్కువ మంది వివాహాలు చేసుకోవడానికి నెలల క్రితమే ఫంక్షన్ హల్స్ ను బుకింగ్ చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హల్స్,వీడియోగ్రాఫర్లు,ఫోటో గ్రాఫర్స్,పెళ్లిల్లు చేసే పురోహితులు,మ్యారేజ్ ఈవెంట్స్ వారిని ముందుగానే మాట్లాడుకోవడంతో ఈ వారంలో వివాహాలు కుదిరిన వారికి ఫంక్షన్ హల్స్ దొరకకపోవడం కొసమెరుపు.
మళ్లీ ముహుర్తాలు ఎప్పుడంటే ....
శ్రావణమాసం ముగుస్తుండడంతో వచ్చే భాధ్రపదం లో ఫూర్ణిమ ముందు దేవపక్షాలని,అమావాస్య ముందు పితృపక్షాలని పండితులు చెబుతున్నారు. దేవపక్షాల్లో తదియగౌరీ దేవతకు,గణపతి నవరాత్రులు, అనంతపద్మనాభస్వామికి పూజలు నిర్వహిస్తారని.. పూర్ణిమ అనంతరం పితృపక్షాల్లో చనిపోయిన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్దాదులు నిర్వహిస్తారని అందుకే భాధ్రపదమాసంలో శుభముహుర్తాలు ఉండవని పురోహితులు చెబుతున్నారు. ఆశ్వీయుజ మాసంలో అమ్మవారి నవరాత్రులు,దీపావళి ఇత్యాది పండుగల అనంతరం కార్తీకమాసంలో ముహుర్తాలు చాలా ఉన్నాయని వారు తెలిపారు. నవంబర్ 16న ప్రారంభమయ్యే ముహుర్తాలు జనవరి 5వ తేదీవరకు ఉంటాయన్నారు.
మరోవైపు గృహప్రవేశాలు,మరోవైపు నిశ్చయతాంబులాలు,ఇంకొకవైపు వివాహాలతో మూడు రోజుల పాటు భాజా భజంత్రీలు,మేళతాళాల మధ్య సందడి నెలకోబోతోందని చెప్పవచ్చు.