Karimnagar News | ఇక్కడ పూజారులు వాటికి ముహుర్తాలు పెట్టట్లేదు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూజారులు ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రసవాలకు ముహుర్తాలు పెట్టమని చెప్పారు. ఇందుకోసం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.
ఓ వైపు సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. అయితే చాలా మంది అనుకున్న సమయానికే పిల్లలు పుట్టేలా.. తిథి, నక్షత్రం చూసుకుంటున్నారు. దీనికోసం పూజారుల దగ్గరకు వెళ్తున్నారు. దీనిపై.. జిల్లా వ్యాప్తంగా పూజారులు స్పందించారు. ఇకపై అలాంటి వాటికి ముహుర్తాలు పెట్టమని చెప్పేశారు. ఈ విషయం అందరికీ తెలిసేలా.. గ్రామాల్లో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో.. గర్భిణీలకు సిజేరియన్ చేసి డెలివరీ చేస్తున్నారు. ఓవైపు.. సాధారణ ప్రసవాలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. గర్భిణీల కుటుంబ సభ్యులు మాత్రం.. తిథి, నక్షత్రాన్ని చూసుకుని.. పలానా సమయానికే.. ప్రసవం జరిగేలా చూడాలని డాక్టర్లను కోరుతున్నారు. దీంతో వైద్యులు సైతం అలానే చేయాల్సి వస్తుంది.
దీంతో అధికారులు పూజారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాలను పాటించేలా చూడాలని తెలిపారు. ఈ మేరకు అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర ప్రసవాల కోసం.. ముహుర్తాలు పెట్టమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పూజారులు. దీనిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
పూజారుల దగ్గరు వచ్చే వారు.. కడుపులో ఉన్న బిడ్డ శుభ ఘడియల్లో పుట్టాలనే పూజారులతో సమయం, తేదీని అడిగి మరి ముహుర్తం పెడుతున్నారు. దీంతో డాక్టర్లు తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సిజేరియన్లు పెరగడం, నార్మల్ డెలివరీలు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై కలెక్టర్ సైతం సీరియస్ గానే ఉన్నారు. ఆపరేషన్ చేసి బిడ్డల్ని బయటకు తీయడం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని వైద్యులను ఆదేశించారు.
డెలివరీలకు ముహుర్తాలు పెట్టమంటూ పూజారులు తీర్మానిచుకున్నట్లుగా ఓ ప్రత్యేక పోస్టర్లను గైనకాలజిస్టులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ప్రసవాలకు ముహుర్తం పెడితే చర్యలు ఉంటాయని.. కలెక్టర్ హెచ్చరించారు.