GHMC Field Asst: హైదరాబాద్‌లో ఘోరం, పారిశుధ్య కార్మికులపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగిక వేధింపులు
23 May 2024, 13:50 IST
- GHMC Field Asst: బతుకుదెరువు కోసం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న మహిళలపై జిహెచ్‌ఎంసి ఫీల్డ్ అసిస్టెంట్ లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం సృష్టించింది.
పారిశుధ్య కార్మికురాలిపై ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు
GHMC Field Asst: హైదరాబాద్ జిహెచ్‌ఎంసిలో ఫీల్డ్ అసిస్టెంట్ దుర్మార్గం బయటపడింది. బతుకుదెరువు కోసం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న మహిళల్ని బలవంతంగా లొంగదీసుకున్న వీడియోలు వెలుగు చూశాయి. జిహెచ్‌ఎంసి కుత్బుల్లాపూర్ జోన్‌లో పనిచేస్తున్న మహిళల్ని నిందితుడు వేధించాడు. పనిచేసే కార్యాలయంలోనే పారిశుధ్య కార్మికుల్ని అసభ్యంగా తాకుతూ వేధించాడు.
కుత్బుల్లాపూర్‌లో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ మహిళా కార్మికులపై లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం సృష్టించింది. అతని పరిధిలో పనిచేస్తున్న 14మంది మహిళా కార్మికులకు రకరకాల కారణాలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వేతనాలు చెల్లించకుండా వేధించాడు. కోరిక తీర్చాలని వారితో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవర్తనపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మహిళలు కొద్ది నెలలుగా నలిగిపోయారు. పనిచేసే కార్యాలయంలోనే మహిళల్ని అసభ్యంగా తాకుతూ ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసుకునే వాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.
ఇటీవల వీడియోలు బయటపడటంతో కార్మికులకు తన గురించి చెప్పొద్దంటూవారి ఖాతాలకు పదివేల చొప్పన నగదు బదిలీ చేశాడు. ఆ తర్వాత వీడియోలు వైరల్‌గా మారాయి. అతడి వేధింపులు తాళలేక ఉద్యోగులు వాటిని బయటపెట్టినట్టు చెబుతున్నారు.
మరోవైపు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ 35వ వార్డులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిషన్ చాలా కాలంగా మహిళా పారిశుధ్య కార్మికుల్ని లైంగికంగా వేధిస్తున్నాడు. రాత్రిపూట విధులకు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసుకుంటున్నాడు. గత కొంత కాలంగా ఈ వ్యవహారం జరుగుతున్నా బాధితులు బయటకు రాలేకపోయారు. ఈ వ్యవహారం సోషల్ మీడియలో వైరల్‌గా మారడంతో జిహెచ్‌ఎంసి అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరపాలక సంస్థకు మహిళ సారథ్యం వహిస్తుంటే మహిళా కార్మికులపై జరుగుతున్న లైంగిక దాడులు చర్చనీయాంశంగా మారాయి.
సూపర్‌వైజర్ సస్పెన్షన్…
పారిశుధ్య కార్మికుల్ని లైంగికంగా వేధించిన సూపర్‌వైజర్ కిషన్‌ను జిహెచ్‌ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్ సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపుల వీడియో వెలుగు చూడటంతో నిందితుడిపై చర్యలకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.